పవన్ కు ముద్రగడ కూతురు జై.. పిఠాపురంలో రగడ.. పద్మనాభం స్పందనిదే!


ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలక నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న ఈ స్థానంలో గెలుపు ఆయనకు ప్రతిష్ఠాత్మకం. ఆయనను ఎలాగైనా ఓడించాలనేది అధికార వైసీపీ పంతం. దీనికితగ్గట్టే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ తమ పార్టీలో చేర్చుకుంది. గోదావరి జిల్లాలను ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావవంతమైన నాయకుడిగా పేరున్న ముద్రగడను పవన్ పైకి ఆయుధంగా ప్రయోగించింది. ఇదే సమయంలో పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికే చెందిన సీనియర్ మహిళా నేత, కాకినాడ ఎంపీగానూ ఉన్న వంగా గీతను పోటీకి దింపింది వైసీపీ. ఈ క్రమంలో ప్రచారం హోరెత్తుతోంది. కాగా, ఇటీవల ముద్రగడ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇప్పుడు ఆయన కుమార్తె కౌంటర్ ఇచ్చారు. 


పద్మనాభం రెడ్డి అవుతా.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అప్పుడు దీనిపై రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. తాజాగా ముద్రగడ కూతురు క్రాంతి లైన్ లోకి వచ్చారు. పవన్ ను ఉద్దేశించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆమె పూర్తిగా ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. పవన్‌ ను తిట్టించేందుకే సీఎం జగన్‌ తన తండ్రిని వాడుకుంటున్నారని ఆరోపించారు. 

అంతేకాక పిఠాపురంలో పవన్‌ గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ ను ఓడించేందుకు వైసీపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మా నాన్నఓ బాధాకరమైన ఛాలెంజ్‌ చేశారు. పవన్‌ ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్‌ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ ప్రకటన ఆయన అభిమానులకూ నచ్చలేదు. వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చు. కానీ.. పవన్‌, ఆయన అభిమానులను కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు. పవన్‌ ను తిట్టించేందుకే మా నాన్నను జగన్‌ వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. పవన్‌ గెలుపుకోసం నా వంతు కృషి చేస్తా’’ అని ముద్రగడ కుమార్తె క్రాంతి స్పష్టం చేశారు. 

ఇది జనసేన నేతల పనే.: ముద్రగడ తన కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియో పట్ల పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు ఇదంతా చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు..వివాహం అయ్యేవరకే తనకు కూతురు అని.. అనంతరం ఆమె అత్తవారింటి అమ్మాయి అని స్పష్టం చేశారు.