ముమ్మిడివరంలో కూటమి అభ్యర్ధి సుబ్బరాజును గెలిపించండి: పిలుపునిచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌


 

Dr.BRA Konaseema, ముమ్మిడివరం: ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు)ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమిలోని పార్టీ శ్రేణులకు, అభిమానులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ నివాసంలో స్థానిక టీడీపీ నేత వర్మతో పవన్‌ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి దాట్ల సుబ్బరాజును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముమ్మిడివరం నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయన చెంతనే సుబ్బరాజును నిలవబెట్టుకుని ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ దాట్ల సుబ్బరాజు కూటమి నుంచి టీడీపీ అభ్యర్ధిగా సైకిల్‌ గుర్తుపై పోటీచేస్తున్నారని, బుచ్చిబాబు గురించి అందరికీ తెలుసు.. ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తొలుత పవన్‌ కల్యాణ్‌కు సుబ్బరాజు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 

పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని, ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అన్నారు. కూటమి కలయికతో రాష్ట్రంలో అరాచక పాలనకు విముక్తి కలుగబోతుందని, దీనికి కీలకంగా బాద్యత తీసుకున్న మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల సారధ్యంలో రాష్ట్రంలో సుపరిపాలన రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. ముమ్మిడివవరం ప్రజలకు తన గెలుపు కోసం పిలుపునిచ్చిన పవన్‌ కల్యాణ్‌కు సుబ్బరాజు కృతజ్ఞతలు తెలిపారు. గడచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేకుండా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితోపాటు నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిరాజు) పేర్కొన్నారు. 

ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి సుబ్బరాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్ధి సుబ్బరాజు ఇంటింటా తిరిగి రాబోయే కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అభివృద్ధికి వచ్చే మే 13 వ తారీఖున జరగభోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటును అభ్యర్ధించారు.