ఒకే జైలుకు నాటి శత్రువులు.. విజయవాడ జైలులో టెన్షన్..


ANDRAPRADESH, VIJAYAWADA: విజయవాడ జైలు లోపల బయట ఒకటే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒకప్పుడు కయ్యానికి కాలు దువ్విన ఇద్దరు శత్రువులు అనుకోకుండా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఒకేచోట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ ఇద్దరు ఎదురుపడితే ఏమవుతుందో అన్న టెన్షన్ ఎక్కువవుతోంది. పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. 


కూటమి ప్రభుత్వ చర్యలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరని వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసినా, ఆ ఇద్దరు ఎదురెదురుపడితే ఏమవుతుందోననే చర్చ టెన్షన్ పుట్టిస్తోంది. వాస్తవానికి ఇద్దరి నేపథ్యాలు వేరు అయినా, ఆ ఇద్దరు గతంలో నువ్వెంత అంటే నువ్వెంత అన్నస్థాయిలో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వంశీదే పైచేయి కావడంతో ఐపీఎస్ అధికారి పీఎస్సార్ బదిలీపై వెళ్లిపోయారు. 

అయితే, యాదృచ్ఛికంగా ఈ ఇద్దరు ఇప్పుడు విజయవాడ జైలులో కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నాప్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, బెదరింపులు, కబ్జాల కేసుల్లో దాదాపు 70రోజులుగా వంశీ రిమాండ్ లో గడపుతున్నారు. ఇదే సమయంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీని బెదిరించారనే ఆరోపణలతో అరెస్టు అయిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును రిమాండు నిమిత్తం విజయవాడ జిల్లా జైలుకే తరలించారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు కూటమి ప్రభుత్వ బాధితులుగానే పరిగణిస్తున్నా, ఆ ఇద్దరి మధ్య గతంలో జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. 

రాష్ట్ర విభజనకు ముందు పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ కమిషనర్ గా పనిచేశారు. అప్పట్లో టీడీపీ నేత యువనేతగా యాక్టివుగా పనిచేసిన వల్లభనేని వంశీతో పీఎస్సార్ కు విభేదాలు ఉండేవని చెబుతుంటారు. కమిషనర్ స్థాయిలో పీఎస్సాఆర్ మహిళలను వేధిస్తున్నారని, ప్రతిపక్షానికి చెందిన తనకు ఆయనతో ప్రాణహాని ఉందని వంశీ తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ వివాదం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పీఎస్సార్ ఆంజనేయులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాల్సివచ్చిందని చెబుతున్నారు. 

వంశీ, పీఎస్సార్ పరస్పరం ఆరోపణలు చేసుకుని, నువ్వెంత అంటే నువ్వెంత అన్నస్థాయిలో ఢీకొట్టడంతో ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఆ ఇద్దరు తమ శత్రుత్వానికి స్వస్తి చెప్పారా? లేక పాత కక్షలు అలానే మనసులో ఉంచుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సామెతలా ఇద్దరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి శత్రువులు మారడంతో ఆ ఇద్దరి మధ్య స్నేహం చిగురించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. గతం గతః అన్నట్లు ఇద్దరు పాత విషయాలను అటకెక్కించే కేసుల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలని అభిమానులు సూచిస్తున్నారు.