పట్టు చీరలకు వీరవరం పెట్టింది పేరు – తక్కువ ధరకే నాణ్యమైన చీరలు



తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం వీరవరం: సంక్రాంతి పండుగ సీజన్‌లో వస్త్ర వ్యాపారం జోరుగా సాగుతోంది. వస్త్రాలకు రాజమహేంద్రవరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఆ రాజమహేంద్రవరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడియం మండలం వీరవరం గ్రామం కూడా ఇప్పుడు పట్టుచీరల కొనుగోలుకు పేరుగాంచుతోంది. 

ఈ గ్రామానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా చీరల కొనుగోలుకు వస్తున్నారంటే ఆశ్చర్యమే. రాజమహేంద్రవరం కంటే మెరుగ్గా ఎలా ఉంటుందనే సందేహం చాలా మందికి కలుగుతుంది. కానీ ఒకసారి ఇక్కడి చీరలు వాడిన వారు మాత్రం మళ్లీ మళ్లీ వీరవరం వైపే వస్తుంటారు.

వీరవరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పెద్ద అద్దాల మేడలు లేవు, ఏసీ షోరూమ్‌లు లేవు, కళ్లను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు లేవు. కస్టమర్లకు నమస్కారాలు పెట్టే సేల్స్ సిబ్బంది ఉండరు. భారీ ప్రకటనలు, ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు, కంప్యూటర్ బిల్లులు, రంగురంగుల కవర్లు కూడా కనిపించవు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులే కలిసి తమ సొంత ఇళ్లలోనే ఈ విలువైన పట్టుచీరలను విక్రయిస్తుంటారు. ఈ గ్రామంలో అనేక కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నాయి.

ఈ గ్రామంలో చీరల వ్యాపారానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఒకప్పుడు వీరవరం‌తో పాటు పరిసర గ్రామాలైన దుళ్ల, మురమండ ప్రాంతాల్లో వందలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవించేవి. అప్పట్లో బలమైన సహకార సంఘాల ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు జరిగేవి. కాలక్రమంలో నష్టాలు, పట్టు ధరల పెరుగుదల వంటి కారణాలతో చేనేత ఉత్పత్తి క్రమంగా తగ్గిపోయింది. చాలామంది పూర్తిగా మానేసిన పరిస్థితి కూడా ఏర్పడింది.

అయితే వీరవరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం మాత్రం కొనసాగింది. ఇక్కడ తయారైన పట్టు చీరలు ఒకప్పుడు ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి వంటి ప్రాంతాలకు సరఫరా అయ్యేవి. ఆ పరిచయాల వల్ల ఇప్పటికీ అక్కడి తయారీదారుల నుంచి నేరుగా చీరలు కొనుగోలు చేసి, తక్కువ నిర్వహణ ఖర్చులతో వినియోగదారులకు విక్రయించగలుగుతున్నారు. అందుకే మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉంటున్నాయి.

ధరలే కాకుండా నాణ్యత విషయంలో కూడా వీరవరం చీరలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో హోల్‌సేల్‌గా వచ్చే చీరల కంటే, చేనేత కుటుంబాలతో నేరుగా సంబంధం ఉన్న కార్మికులు తయారు చేసే చీరల నాణ్యతపై వీరికి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రీమియం స్టాక్‌ను మాత్రమే తీసుకొచ్చి అమ్మడం వల్ల వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. మార్కెట్‌లో ఏడు వేల రూపాయల ధర ఉన్న చీర ఇక్కడ ఐదు వేల రూపాయలకే దొరుకుతుందని కొనుగోలుదారులు చెబుతున్నారు.

అందుకే ఇప్పుడు పట్టుచీరల విషయంలో “వీరవరం” పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.



WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now