INDIA HEALTH NEWS: భారత్‌లో ఇటీవల డయాబెటిస్, ఊబకాయం బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం తగ్గిపోవడం వంటి కారణాలతో చిన్నారులు, యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో డయాబెటిస్, వెయిట్ లాస్‌కు ఉపయోగించే మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఈ క్రమంలో డయాబెటిస్ పేషెంట్లకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే యాంటీ డయాబెటిస్ మందులు అందించేందుకు సిద్ధమైంది. డయాబెటిస్‌తో పాటు బరువు తగ్గేందుకు ఉపయోగించే ఒజెంపిక్ (Ozempic) మందును తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోటియా తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఒజెంపిక్ వీక్లీ డోస్‌ను రూ.2,200కే అందించనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో డయాబెటిస్ బాధితులపై ఉండే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒజెంపిక్‌కు పోటీగా ఉన్న ఎలి లిల్లీస్ కంపెనీకి చెందిన మౌంజారో మందు వీక్లీ డోస్ ధర రూ.3,200 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. అదే సమయంలో నోవో నార్డిస్క్‌కు చెందిన మరో వెయిట్ లాస్ డ్రగ్ వెగోవీ ధర రూ.2,700 నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ ధరల నేపథ్యంలో ఒజెంపిక్ వీక్లీ డోస్ విలువను రూ.2,200గా నిర్ణయించామని వివరించారు. దీని ప్రకారం నెలకు సుమారు రూ.8,800 ఖర్చవుతుందని తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒజెంపిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైందని, త్వరలోనే సమీప మెడికల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రానుందని విక్రాంత్ శ్రోటియా వెల్లడించారు. ఈ మందు 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ వేరియంట్లలో లభిస్తోందని తెలిపారు. అయితే 1 ఎంజీ వేరియంట్ నెలవారీ ధర సుమారు రూ.11,175గా ఉండనుందని చెప్పారు.
అయితే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందును స్వయంగా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కాబట్టి తప్పనిసరిగా వైద్యుల సూచనలతోనే ఈ ఔషధాన్ని వాడాలని సూచించారు.
