ANDRAPRADESH: రాజకీయం అన్నాక పార్టీలు పెట్టడం కామన్. కొత్తగా పార్టీలు ప్రతీ సీజన్ కి వస్తూనే ఉంటాయి. గతంలో కూడా అనేక పార్టీలు ఎన్నికల ముందు పుట్టాయి. చాలా వరకూ జాతకాలు తేలి పక్కకు పోయాయి. అతి కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇక సుదీర్ఘంగా కొనసాగుతున్న పార్టీలు అయితే మరీ స్వల్పం అని చెప్పాలి.
మారుతున్న జనాల అభిరుచులు, బలమైన సామాజిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లు, ఆకాంక్షలు ఇలా చాలా విషయాలు చూసుకుంటే కనుక కొత్త పార్టీలు ఆవిర్భావం అంతకంతకు పెరుగుతోంది. అలా 2029 ఎన్నికల ముందు చాలా పార్టీలు పురుడు పోసుకుని రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఉత్సాహంలో మాజీ ఐపీఎస్ లు :
ఐపీఎస్ అధికారులుగా సుదీర్ఘ కాలం రాష్ట్రానికి సేవలు చేసి తనకంటూ సొంత ముద్రను బలంగా వేసుకుని పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఏబీ వెంకటేశ్వరరావు ఒకరు, ఆయన గతంలో కీలక పదవులు నిర్వహించి ఉన్నారు. ఇక ఆయన పదవీ విరమణ చేశాక రాజకీయాల మీద మక్కువ పెంచుకున్నారు. తాజాగా ఆయన పలు యూట్యూబ్ చానళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తూ తాము తప్పకుండా కొత్త పార్టీ పెడతాను అన్ అంటున్నారు.
రాజకీయాల మీద ఆసక్తితో పాటు సమాజానికి సేవ చేయడానికి ఆ రంగం బెటర్ అని భావించే తాను వస్తున్నాను అని చెప్పారు. సో ఏబీ వెంకటేశ్వరరావు పార్టీ అయితే వచ్చే ఎన్నికల నాటికి ఖాయం అని అంటున్నారు. అదే వరసలో మరో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కూడా మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు.
బడుగుల సమస్యల మీద :
ఆయన బడుగులు అణగారిన వర్గాల సమస్యల మీద తాను మాట్లాడుతుంటానని చెప్పుకొస్తున్నారు. వారికి న్యాయం జరిగేంతవరకూ తాను వార్కి అండగా ఉంటాను అని చెబుతున్నారు. బహుశా ఆయన మదిలో ఏదైనా పార్టీ పెట్టే ఆలోచన ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన ఇటీవల కాలంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు చేస్తున్న విమర్శలు చూస్తే ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారనే అంటున్నారు.
షర్మిల విషయంలో :
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల రాయలసీమ పరిధిలో ఒక కొత్త పార్టీ ప్రారంభిస్తారు అని పుకార్లు అయితే షికారు చేస్తున్నాయి. ఆ పార్టీ సబ్ రీజనల్ పార్టీగా ఉంటుందని అంటున్నారు. రాయలసీమ రాష్ట్ర సమితి అన్న పేరుతో కూడా ప్రచారం అయితే సాగుతోంది. మరి ఈ వార్తలలో నిజమెంత అన్నది తెలియదు కానీ షర్మిల మాత్రం పార్టీ పెడతారు అని అంటున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనంగా ఉంటుందని చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర స్థాయిలో :
ఇక ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్రా స్థాయిలో ఒక సబ్ రీజనల్ పార్టీ ఒకటి ఆవిర్భవించడం ఖాయమని అంటున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ లేదా ఒక ఫ్రంట్ గా ఏర్పడి కొంతమంది లైక్ మైండెడ్ వ్యక్తులతో పోటీ చేయిస్తారు అని అంటున్నారు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలు ఈ ఫ్రంట్ వెనక ఉన్నాయని చెబుతున్నారు.
ఎవరికి చేటు :
కొత్త పార్టీలు పుట్టుకుని వస్తే ఎవరికి చేటు ఎవరికి ప్లస్ అన్నది చర్చగా ఉంది. నిజానికి చూస్తే అధికార పక్షం మీద సహజంగా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. విపక్ష పార్టీలు ఆ ఓట్లను అందుకోవాలని చూస్తాయి. ఒకటికి మించి పార్టీలు అపొజిషన్ లో ఉంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోయి విపక్షం నష్టపోతుందని అదే సమయంలో అధికార పార్టీకే మేలు జరుగుతుంది అన్నది ఒక రాజకీయ విశ్లేషణ.
మరో వైపు చూస్తే ఆయా పార్టీలు పెట్టిన వ్యక్తులు వారి నేపధ్యాలు సామాజిక పరిస్థితులు ప్రాంతీయ పరిణామాలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎవరికి చేటు అన్నది స్పష్టం అవుతుందని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కొత్త పార్టీలు అయితే 2029 కి ఇపుడు అనుకుంటున్న వాటితో పాటుగా మరిన్ని వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు.
