ANDRAPRADESH, CREIM NEWS, SRI SATYASAI: ఏపీలో ఘోర సంఘటన జరిగింది. ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు స్టేషన్ ముందే.. సోమవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ఈ సమయంలో పోలీసులు కూడా పక్కనే ఉన్నారన్నది స్థానికులు చెబుతున్న మాట.
అయినప్పటికీ.. హంతకులు వాడిన కత్తులు, గొడ్డళ్లను చూసి.. పోలీసులు సైతం భీతితో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హంతకులు, మర్డర్లు చేసేవారికి సింహస్వప్నంగా ఉండే పోలీసుల ఎదుటే ఈ హత్య చోటు చేసుకోవడంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీనిపై విచారణ చేయించి.. నివేదిక ఇవ్వాలని డీజీపీని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. ఈ పరిణామంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈశ్వరప్ప, హరి అనే వ్యక్తుల మధ్య కొన్నాళ్లుగా వివాదం చోటు చేసుకుంది. హరి భార్యతో ఈశ్వరప్పకు వివాహేతర సంబంధం ఉందని హరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట.. హరి భార్య, ఈశ్వరప్ప.. ఇరువురు వేరే చోటకు వెళ్లిపోయారు. దీనిపై హరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన తనకల్లు పోలీసులు ఈశ్వరప్ప... హరి భార్య కలిసి ఉండడాన్ని గుర్తించి.. వారిని అరెస్టు చేసి.. సోమవారం తెల్లవారు జామున స్టేషన్‌కు తీసుకువచ్చారు.
ఇదే సమయంలో అక్కడే మాటు వేసిన హరి ఆయన సోదరులు.. పోలీసుల జీపు నుంచి కాలు బయట పెట్టి.. స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈశ్వరయ్యను చుట్టుముట్టి.. కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఊహించని ఘటనతో భీతిల్లిన పోలీసులు.. అక్కడి నుంచి స్టేషన్‌లోకి పరారయ్యారు. హరి భార్య కూడా అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఈశ్వరప్ప.. అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన స్టేషన్ ముందే హత్య జరగడం ఇదే తొలిసారి అని స్థానికులు తెలిపారు.
