ANDRAPRADESH, ANANTHAPURAM; మొదట కారును లారీతో గుద్ది, ఆ తర్వాత వేటకోడవళ్లతో దాడి చేసి.. కాంగ్రెస్ నేతను దారుణంగా నరికి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఊహించని ఘటనతో రాయలసీమలో మళ్లీ ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గానే కాకుండా ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడుగా కూడా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.
గుంతకల్ నుంచి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మొదట లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్‌తో ఢీ కొట్టారు. ఆ తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అయితే తీవ్రగాయాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతే కాకుండా ఈ ఘటనలో జరిగేటప్పుడు కారులో ఉన్న ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణపై దాడి చేసింది ఎవరు.. దాడి చేయడానికి గల కారణాలు ఏంటి ? అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్, లారీ ఓనర్ గురించి తెలుసుకుంటున్నారు.
ఇక ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన రీతిలో ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. లారీతో ఢీ కొట్టి, వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుందని అన్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అలానే లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణ కుటుంబానికి అండగా నిలుస్తుందని.. వారికి అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి.. ఏపీ పోలీసులతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ట్యాగ్ చేశారు.