భారత్ లో పాక్ పౌరులు.. చిన్నపాటి కన్సెషన్ ఇచ్చిన భారత్!


INDIA: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు భారత్ పలు దౌత్యపరమైన షాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. పాకిస్థాన్ పౌరులంతా భారత్ ను వీడి వెళ్లిపోవాలని ఆదేశించింది. అందుకు ఏప్రిల్ 30ని డెడ్ లైన్ గా ప్రకటించింది. అప్పటిలోగా వెళ్లకపోతే అరెస్టులు తప్పవని హెచ్చరించింది. అయితే... తాజాగా చిన్నపాటి కన్సెషన్ ఇచ్చింది! పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన గడువును ఏప్రిల్ 30గా తెలిపింది. దీంతో... బుధవారం నాటికి మొత్తం 786 మంది భారత్ నుంచి వెళ్లిపోగా.. వారిలో 55 మంది దౌత్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. 

 
వీరంతా అటారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్ వెళ్లిపోయారు. మరోపక్క పాకిస్థాన్ నుంచి 1,465 మంది భారత్ కు వచ్చారు. వీరిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు ఉన్నారు. ఈ వివరాలను అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం గడువులో చిన్నపాటి సడలింపు ఇచ్చింది. వాస్తవానికి భారతదేశంలో ఉంటున్న పాకిస్థాన్ జాతీయులు ఏప్రిల్ 30లోగా సరిహద్దును దాటాలని.. అనంతరం దాన్ని మూసివేస్తామని గతంలో ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. తాజాగా వాటిని కాస్త సవరించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. 

ఏప్రిల్ 30తో గడువు ముగిసిన అనంతరం సరిహద్దుల్లో చిక్కుకుపోయిన చాలా మందికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోపక్క సరిహద్దులు దాటుతున్న వారి ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు, కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి! కాగా... పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం భారత్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్వల్పకాలిక, సార్క్ వీసాలు కలిగి ఉన్నవారు ఏప్రిల్ 27లోగా.. వైద్య వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 29 లోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! 

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి.. నిర్ణీత గడువుకు మించి భారత్ లో ఏ పాకిస్థానీ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ సమయంలో... భారతీయులను వివాహం చేసుకున్న పాకిస్తానీలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం... ఏప్రిల్ 30 గడువును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ.. అట్టారీ-వాఘా సరిహద్దు గుండా పాకిస్థాన్ ను వెళ్లవచ్చని తెలిపింది.