టీడీపీ ఎమ్మెల్యే బంధువు వేధింపులు.. ఫార్మసి విద్యార్థి ఆత్మహత్య!


రాజమండ్రి: రాజమండ్రిలో 12 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విద్యార్థిని ప్రాణాలు వదిలేసింది. ఫార్మసి చదువుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న విద్యార్థిని అదే ఆస్ప్రతిలో పనిచేస్తున్న ఉద్యోగి దీపక్ మోసం చేసినట్లు బాధితురాలు సూసైడ్ నోట్ రాసింది. ప్రమాదకరమైన ఇంజక్షన్ చేసుకుని కోమాలోకి వెళ్లిన విద్యార్థిని వారంపాటు రాజమండ్రిలో ఓ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ చివరికి కన్నుమూసింది. ఈ సంఘటనతో ఫార్మసి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.


ఫార్మసి ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని మృతితో బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుని 12 రోజులు అవుతున్నా, ప్రభుత్వం తరఫున ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు దీపక్ కాకినాడ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేకు దగ్గర బంధువుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి దీపక్ పనిచేశాడని అంటున్నారు. దీంతో నిందితుడిని రక్షించేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. 

గత 23 నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన తర్వాత మూడు రోజుల వరకు పోలీసులు ఈ విషయాన్ని బయట పెట్టలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడే మృతురాలి ఫోన్ నుంచి తమకు ఫోన్ చేసి చెప్పాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనేది తేల్చాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం లేదు. చాలా కలలు కన్నాను. ఓ ఫంక్షన్‌కు చీర కట్టుకుని వెళ్లడమే నా పాపమైంది. ఆ మోసగాడి కన్ను నాపై పడింది. నాకు వేరే దారిలేక చనిపోతున్నా. అమ్మనాన్నా క్షమించండి. తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నా. ఆఖరికి నేను చదువుకున్న చదువు నేను చనిపోవడానికే అన్న సంగతి గ్రహించలేకపోయా. ఆడపిల్లలకు రక్షణ లేదు. నన్ను ఎంత కొట్టినా, తిట్టినా ఓపికగా భరించా. ఇక తట్టుకునే శక్తి లేదు. అతడు చాలా లైంగికంగా వేధించాడు. అతడి భార్య, బిడ్డ గురించి ఆలోచించి నోరు తెరవలేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోశాడు. 

చనిపోతూ అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కుమిలిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. ఓ ఆడపిల్ల ఉసురు ఊరికే పోదు. నా అవయవాలు ఇతరులకు సజీవంగా దానం చేయమని ప్రాధేయపడుతున్నా.’’ అని ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని సూసైడ్ నోట్ రాసిందని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమార్తె. పెళ్లైయిన 11 సంవత్సరాల తర్వాత పుట్టిన ఆడబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చివరికి మోసగాడి చేతిలో బలైపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.