ANDRAPRADESH: జగన్ ఇప్పటి వరకు తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశాలైన, మీడియాతో ముచ్చటైనా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే జరిగేవి. వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ క్షేత్రాన్ని మార్చుతున్నారా? ఇప్పటివరకు తాడేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసిన జగన్.. ఇప్పుడు బెంగళూరు యలహంకలోని తన నివాసం నుంచి రాజకీయ దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నారా?
వైసీపీ వర్గాల సమాచారం మేరకు ఇక నుంచి బెంగళూరులోనూ పార్టీ నేతలతో జగన్ భేటీలు జరుగుతాయని చెబుతున్నారు. జగన్ రాజకీయాల్లోకి రాక ముందే యలహంకలో పెద్ద ప్యాలెస్ ఉన్నా, దాన్ని ఎప్పుడూ రాజకీయ కేంద్రంగా ఉపయోగించలేదు. కానీ, ఇటీవల అక్కడ కూడా పార్టీ నేతలతో భేటీ అవుతుండటం చర్చనీయాంశమవుతోంది.
జగన్ ఇప్పటివరకు తాడేపల్లి కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశాలైన, మీడియాతో ముచ్చటైనా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే జరిగేవి. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్రంగా ఈ సమావేశాలు నిర్వహించేవారు. అంతేకాని ఎప్పుడూ బెంగళూరులోని యలహంకలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అవ్వలేదు.
అంతేకాకుండా అక్కడి నుంచి రాజకీయపరమైన ప్రకటనలు చేయలేదు. యలహంక నివాసాన్ని పూర్తిగా తన వ్యక్తిగత, వ్యాపార, కుటుంబ అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ, తాజాగా కొందరు పార్టీ నేతలను యలహంక పిలిపించుకుని మాట్లాడటమే చర్చనీయాంశమవుతోంది.
2019-24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తన సమయాన్ని పూర్తిగా తాడేపల్లిలోనే గడిపేవారు. సాయంత్రం 6 తర్వాత రాజకీయ, ప్రభుత్వ పరమైన విధులకు దూరంగా ఉండేవారు. మిగిలిన సమయం మొత్తం కుటుంబ సభ్యులతో గడపటానికే ఇష్టపడేవారు. ఈ విషయాన్ని అప్పట్లో జగనే స్వయంగా వెల్లడించారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులో గడుపుతున్నారు. నెలలో ఒకటి, రెండు సార్లు మాత్రమే తాడేపల్లి వస్తూ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే తాను ఎక్కువగా బెంగళూరులో ఉండటం, తనను కలవాలనుకుంటున్న పార్టీ నేతలకు అందుబాటులో ఉండలేకపోవడంపై కేడర్ నుంచి భిన్నస్వరాలు వినిపిస్తుండటంతో జగన్ తొలిసారిగా తన పొలిటికల్ యాక్టవిటీస్ కి యలహంక డోర్లు తెరిచారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులను బెంగళూరు పిలిపించి మాజీ సీఎం జగన్ మాట్లాడారు.
బెంగళూరులో పార్టీ నేతలను కలవడం ఇదే తొలిసారి. దీంతో రానున్న రోజుల్లో బెంగళూరు, తాడేపల్లి ఎక్కడున్నా నేతలకు అందుబాటులో ఉంటానని జగన్ సంకేతాలిచ్చారని అంటున్నారు. దీంతో తమ అధినేతతో ఎప్పుడైనా కలిసే అవకాశం దక్కిందని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.