ANDRAPRADESH, KAKINADA: తాజాగా పిఠాపురంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. తనకు పార్టీలతో సంబంధం లేదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తానని చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గంలో రాజకీయాలు ఎలా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నప్పుడు.. ఆ తర్వాత.. అదే పార్టీకి చెందిన ఇతర నాయకులు పర్యటిస్తున్నప్పుడు పరిణామాలు.. పరిస్థితులు కూడా వేరేగా ఉంటున్నాయి. జనసేన-టీడీపీ వర్గాలు రెండుగా చీలిపోయి.. వివాదాలు.. విభేదాలతో నే కాలం వెళ్లదీస్తున్నాయి. ఈ పరిణామాలు ఇకపైనా కొనసాగుతాయా? ఇక ఆగిపోతాయా? అన్నది చర్చకు వచ్చింది.
తాజాగా పిఠాపురంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. తనకు పార్టీలతో సంబంధం లేదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తానని చెప్పారు. అయితే.. ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి ఆయన చేశారు? అన్నదే ప్రశ్న. ఎందుకంటే.. ఇటీవల ఓ గ్రామంలో ఎస్సీలపై బహిష్కరణ వేటు పడింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనను ఉద్దేశించే.. పవన్ అలా వ్యాఖ్యానించి ఉంటారని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.
దీనిపై టీడీపీ వర్గాలు మరో వ్యాఖ్యానం చేస్తున్నాయి. జనసేన కార్యకర్తల దూకుడును దృష్టిలో పెట్టుకునే పవన్ ఇలా కామెంట్లు చేశారని వారు చెబుతున్నారు. మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ వ్యాఖ్యల విషయంలోనూ ఎవరికి వారు తమకు నచ్చిన రీతిలో అన్వయం చేసుకోవడం గమనార్హం. కానీ, వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. రెండు పార్టీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి పార్టీల నేతల మధ్య సమన్వయం ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.
అదే సమయంలో రెండు పార్టీలు కలిసి ఉంటే జరిగే మేలు వేరుగా ఉంటుందన్న కోణంలోనూ.. పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే.. ఎవరినీ నిర్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయకపోవడం.. నర్మగర్భంగా కామెంట్లు చేయడంతో ఎవరికి వారు.. ఎలా అయినా.. అన్వయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయాల్లో పెద్దగా మార్పు వస్తుందని ఊహించలేమని.. పలువురు మేధావులు, పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.