AMARAVATHI: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ వేడుకకు ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ హాజరవుతున్న కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు పంపింది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని చెబుతున్న ప్రభుత్వం.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కూడా ఆహ్వానపత్రిక అందింది. అయితే ప్రభుత్వ ఆహ్వానంపై వైసీపీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రాజధాని పనుల పునఃప్రారంభానికి జగన్ హాజరుకావాలా? వద్దా? అనే విషయమై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
రాష్ట్ర ప్రజలు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజధాని పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఆయనను అధికారికంగా ఆహ్వానించింది. గతంలో మూడు రాజధానుల నినాదం తీసుకున్న జగన్... ఇప్పుడు వైఖరి మార్చుకుని ప్రభుత్వ ఆహ్వానం మేరకు పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వెళతారా? లేదా? అనేది చర్చకు దారితీస్తోంది.
కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి మాత్రమే కట్టుబడి పనిచేస్తోంది. భవిష్యత్తులో ఎవరు వచ్చినా రాజధాని మార్చలేని విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. గతంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉండటం వల్ల రాజధానిగా అమరావతిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాలపరిమితి తీరిపోవడం వల్ల అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటులో చట్టం చేయడంతోపాటు గెజిట్ విడుదల చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. శుక్రవారం దాదాపు రూ.57 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ పనులను కూడా అమరావతి కేంద్రంగానే ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇంకా పాత నినాదంతోనే ముందుకెళితే ఏం అవుతుంది? వైఖరి మార్చుకున్నామని అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా జరిగే లాభనష్టాలేంటి? అన్న విషయమై వైసీపీలో చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఆహ్వానంపై అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ వైసీపీలో ఏ ఒక్కరూ మాట్లాడలేదని అంటున్నారు. మరోవైపు రాజధాని పనుల టెండర్లు, అదనపు భూసమీకరణ వంటివాటిని నిశితంగా గమనిస్తున్న వైసీపీ.. ఆయా అంశాల్లో ఏమైనా తప్పు దొర్లితే అవకాశంగా మల్చుకోవాలని ఎదురుచూస్తోంది.
దీంతో అమరావతి పనుల పునఃప్రారంభానికి మాజీ సీఎం జగన్ హాజరుపై అస్పష్టత కొనసాగుతోంది. తాను వెళ్లకుండా పార్టీ తరఫున ప్రతినిధులను పంపితే సరిపోతుందా? అన్నది వైసీపీలో చర్చిస్తున్నారు. పార్టీ తరఫున ఎవరు వెళ్లినా అమరావతికి మద్దతు తెలిపినట్లై అవుతుందని అంటున్నారు. అలా అయితే దాన్ని సమర్థించుకోవడంపైనా చర్చిస్తున్నారు. మొత్తానికి అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమం వైసీపీని గందరగోళ పరిస్థితిలోకి నెట్టేసిందని అంటున్నారు.