ANDRAPRADESH, AMARAVATI: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. BY: BCN TV NEWS ముఖ్యంగా మద్యం అమ్మకాల్లో వచ్చిన సొమ్మును అక్రమంగా తరలించారంటూ సీఐడీ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుండటం, తదుపరి అరెస్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దేనంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ వీటిపై స్పందించారు. తన అరెస్టుపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. తాను విజయవాడలోనే ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.
ఇవాళ తాడేపల్లిలోని నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ జగన్.. మద్యం కుంభకోణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు, ప్రచారాన్ని ఖండించారు. ఏది స్కాం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు ప్రచారంపై స్పందిస్తూ.. తాను విజయవాడలోనే ఉన్నానని.. అరెస్టు కోసం వచ్చే వారికి స్వాగతిస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి షాకిచ్చాయి. దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించాయని జగన్ గుర్తుచేశారు. తనకు అరెస్టులు కొత్త కాదని, వైసీపీ నాయకులకు ఇబ్బందులు కూడా కొత్త కాదన్నారు. ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టిందని, ఎదిగిందని, కొనసాగుతోందని జగన్ గుర్తుచేశారు. తాను కూడా ఒక నాయకుడిగా ఎదిగానని జగన్ చెప్పుకొచ్చారు. ఎక్కడైనా అరెస్టులు, కేసులు అన్నది ప్రశ్న కాదని వాటిలో న్యాయం ఎంత ఉంది అన్నదే చూడాలన్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. న్యాయం, ధర్మం వైపు దేవుడు ఉంటాడని తప్పకుండా దుర్బుద్ధితో చంద్రబాబు చేసే అరెస్టుల మీద మొట్టికాయలు వేస్తాడని తెలిపారు.
మొత్తం మీద లిక్కర్ స్కాంలో జగన్ అరెస్టు తప్పదంటూ కూటమి పార్టీలు కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారంపై ఆయనే స్వయంగా స్పందించడం, అరెస్టు చేస్తానంటే రెడీ అంటూ చెప్పేయడం చూస్తుంటే అన్నింటికీ ముందే ప్రిపేర్ అయినట్లే కనిపిస్తోంది. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో లిక్కర్ స్కాంపై దర్యాప్తు ముగించి ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది.