ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు పథకం అప్పటి నుంచే.. లేటెస్ట్ అప్‌డేట్


ANDRAPRADESH: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ. BY: BCN TV NEWS సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా టీడీపీ కూటమి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. తాజాగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం అమలుపైనా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ పథకాలను ప్రారంభించనున్నారు. జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ప్రారంభించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైనా నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.


మహిళల సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. పథకం అమలు కోసం ఇలాంటి పథకాలు అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మంత్రులు అధ్యయనం చేశారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మంత్రుల కమిటీ కర్ణాటకలో అమలవుతున్న శక్తి పథకం విధివిధానాలను పరిశీలించింది. బెంగళూరులో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఏపీ మంత్రులు ఉచిత బస్సు పథకం అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అటు తెలంగాణలోనూ మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు.

మరోవైపు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చని అంచనా. అలాగే ఉచిత బస్సు పథకం వల్ల ఏపీఎస్ఆర్టీసీ రోజుకు రూ. 4 కోట్లు భారం పడొచ్చని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి సమకూర్చనుంది. మరో రెండు నెలల్లో ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. బస్సుల లభ్యత గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పథకం అమలు కోసం అదనపు బస్సులు కొనుగోలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ తరహాలో రాష్ట్రమంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా లేదా జిల్లాల వరకే పరిమితం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now