వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిపై వైసీపీ నేత అంబటి న్యాయ పోరాటం ఎందుకంటే?


ANDRAPRADESH: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నారు. కనిపించని శత్రువులతోనూ యుద్ధానికి సై అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తలనొప్పిగా మారిన యూట్యూబర్లపై న్యాయపోరాటం చేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రధానంగా ఇద్దరు యూట్యూబర్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీరిలో మొదటి వ్యక్తి యూట్యూబర్ సీమరాజా కాగా, రెండో వ్యక్తి జబర్దస్త్ ఫ్రేమ్ కిరాక్ ఆర్పీ. ఈ ఇద్దరు యూట్యూబ్ వేదికగా వైసీపీ నేతలుతోపాటు తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిపైనా అనుచిత ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అవుతున్నారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోకపోవడంతో కోర్టు ద్వారా కేసు నమోదు చేయించేందుకు పిటిషన్ దాఖలు చేశారు. 


ఎన్నికల అనంతరం చాలా మంది వైసీపీ నేతలు బయటకు రావడానికి ఇష్టపడకపోతే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు విషయంలో పోలీసులతో అమీతుమీ తేల్చుకునేందుకు గతంలో పోరాడారు అంబటి. ఆయన పోరాటంతో అదుపులోకి తీసుకున్న వెంటనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. 

దీనివల్ల పోలీసుల చేతిలో వేధింపులు లేకుండా కార్యకర్తలను అంబటి ఆదుకున్నారని అంటారు. ఆ పోరాటంలో సక్సెస్ అయిన అంబటి, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పార్టీపై బురద జల్లుతున్న ప్రత్యర్థులపై కన్నేశారు. వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అంటూ చెప్పుకుని, పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్న సీమారాజాపై కేసు నమోదు చేయించేందుకు అంబటి తీవ్ర పోరాటం చేస్తున్నారు. 

యూట్యూర్ సీమరాజా తన చానల్ ద్వారా సెటైరికల్ వీడియోలు చేస్తుంటారు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాయలసీమ యాసలో వైసీపీ నేతలా ఫోజిస్తూ వీడియోలు చేస్తుంటాడు. వ్యంగ్యంగా ఆయన చేసే వీడియోలు వైసీపీని తీవ్రంగా నష్టపరిచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా, సీమారాజాను పట్టించుకోని ఆ పార్టీ నేతలు ఎన్నికల అనంతరం తమకు జరిగిన నష్టంతో ఇప్పుడు సీమరాజాకు బ్రేకులు వేయాలని భావిస్తున్నారు. 

సోషల్ మీడియా దుష్ప్రచారంపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నందున తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న సీమారాజాపై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి అంబటి గతంలో ఫిర్యాదు చేశారు. అయితే సీమారాజా వ్యాఖ్యలతో అంబటికి ఎలాంటి నష్టం లేదని చెబుతూ పోలీసులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించలేదని అంటున్నారు. సోషల్ మీడియాలో తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న అంబటి మొత్తం ఐదు ఫిర్యాదులు చేయగా, నాలుగు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఒకటి తిరస్కరించారు. ఆ ఒక్కటి సీమరాజాతోపాటు జబర్దస్త్ ఫ్రేమ్ కిరాక్ ఆర్పీకి సంబంధించినది కావడం గమనార్హం. 

తాను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసినా భయపడకుండా, మరింత రెచ్చగొట్టేలా సీమారాజా వీడియోలు చేస్తుండటంతో అంబటి రాంబాబు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా, వృత్తిరీత్యా న్యాయవాది అయిన అంబటి చాలా కాలం తర్వాత పార్టీ ఇన్ పర్సన్ గా తన కేసులను తానే వాదించుకుంటున్నారు. సీమరాజాపై తాను పెట్టిన కేసును పోలీసులు నమోదు చేసేలా ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అంతర్జాతీయ కార్యదర్శినంటూ సీమారాజా లేని పోస్టు సృష్టించుకుని ప్రజలను, పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి ఆరోపిస్తున్నారు. ఇక మరో యూట్యూబర్, జబర్దస్త్ ఫ్రేమ్ కిరాక్ ఆప్పీపైనా మాజీ మంత్రి అంబటి న్యాయపోరాటం చేస్తున్నారు. 

గత ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు పలికిన కిరాక్ ఆర్పీ, ఎన్నికల అనంతరం యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వైసీపీ నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి ఆర్కే రోజాతోపాటు మరికొందరు మహిళా నేతలపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు మాజీ మంత్రి అంబటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంబటి ఫిర్యాదును పోలీసులు తిరస్కరించడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. సీమరాజా, కిరాక్ ఆర్పీపై కేసులు నమోదు చేసేంతవరకు తాను న్యాయపోరాటం చేస్తానని మాజీ మంత్రి ప్రకటించారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటూ మాజీ మంత్రి అంబటి చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో అంబటి ఫిర్యాదు చేస్తానని బెదిరించడంపైనా సీమరాజా వ్యంగ్యంగా వీడియోలు చేస్తుండటం గమనార్హం.