ANDRAPRADESH, AMARAVATHI: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. BY: BCN TV NEWS రాజధాని పరిధిలోని ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో టీడీపీ నేత రాజుపై మాజీ ఎంపీ, ఆయన సోదరుడు ప్రభుదాసు కలిసి దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎంపీ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుడు ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.
వైసీపీలో దళిత నేతగా గుర్తింపు పొందిన నందిగం సురేశ్ 2019-24 మధ్య బాపట్ల ఎంపీగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. వైసీపీ అధికారంలో ఉండగా, నందిగం సురేశ్ తిరుగులేని నేతగా చెలామణీ అయ్యారు. రాజధాని అమరావతి పరిధిలో నివసిస్తున్న మాజీ ఎంపీ సురేశ్.. అమరావతి వ్యతిరేక ఉద్యమం నడిపడంలో తెరవెనుక పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలోని టీడీపీ నేతతో ఆయన ఘర్షణకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శించిందని అంటారు. వైసీపీ హయాంలో నమోదైన ఓ హత్య కేసులో మాజీ ఎంపీని నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడం, ఆ ఘటనలో మరియమ్మ అనే మహిళ మరణానికి మాజీ ఎంపీ నందిగం కారణమని ఫిర్యాదుతో ఆయనను అరెస్టు చేసి సుమారు 90 రోజులు జైలులో ఉంచారు. అదేవిధంగా మరికొన్ని కేసులు కూడా నమోదు అవడంతో ఆయన కోర్టు, పోలీసుస్టేషన్ల మధ్యే తిరగాల్సివస్తోందని చెబుతున్నారు.
అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులోనూ మాజీ ఎంపీ నందిగంపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పాత కేసులు అన్నింటిపైనా బెయిల్ తెచ్చుకున్న ఆయన టీడీపీ నేతపై దాడి చేయడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.