ప్రధాని మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు తయారైందని వైఎస్ షర్మిల ఎద్దేవా


AMARAVATHI: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.


రాజధాని అమరావతి పునఃప్రారంభం సందర్భంగా కేంద్రం నుంచి నిధుల కేటాయింపు, ఆర్థిక సహాయాన్ని ప్రకటించకపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరునూ తప్పుపట్టారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందంటూ మండిపడ్డారు.

ప్రధాని మోదీ తీరు చిచ్చుబుడ్డి తుస్సుమన్నట్లు తయారైందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఏపీ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని, కొత్త రాజధానిలో మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని గుర్తు చేశారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. 2015లో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని, నేడు ముఖాన సున్నం కొట్టి వెళ్ళారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 

పదేళ్ల కిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారని మండిపడ్డారు. మళ్ళీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారని షర్మిల అన్నారు. అయిదు కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్నీ చేశామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, అన్ని ఇస్తే రాష్ట్ర ప్రజలకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ఆమె నిలదీశారు.

అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా?.. పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా? చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితబోధ చేశారు. ప్రధాని మోదీని నమ్మి తాను మళ్ళీ మళ్ళీ మోసపోతున్నట్లేనని చంద్రబాబు తెలుసుకోవాలని షర్మిల పేర్కొన్నారు. 

ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు.. మళ్ళీ మోడీని పిలిచి అదే గోతిలో పగలు పడ్డారంటూ చురకలు అంటించారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు.. నిధులు అని, రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని షర్మిల గుర్తు చేశారు. అప్పు పుట్టనిదే జీతాలకు దిక్కులేదని చెప్పే చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ఎవరిని అడిగి 60,000 కోట్ల రూపాయల అప్పు తెస్తున్నారని షర్మిల నిలదీశారు. దీనికి వడ్డీల భారం మోసేదెలా? అంటూ ప్రశ్నించారు.

వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కోల దగ్గర రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డీమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి అని, వాటిని అమ్మి రాజధాని ఎలా కడతారు? కేంద్రం మెడలు వంచే దమ్ములేక భావితరాల మీద అప్పు భారం ఎందుకు మోపుతున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now