విజయవాడకు మహర్దశ.. ఆ ప్రాంతంలో కొత్తగా డబుల్ డెక్కర్


VIJAYAWADA: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో ముందడుగు వేసింది. చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16పై రద్దీగా ఉండే ప్రాంతంలో.. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు సంబంధించి డీపీఆర్ (Detailed Project Report) తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) సలహా సంస్థల నుంచి RFP (Request For Proposal) కోరింది. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో కలిసి APMRCL ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనుంది. ఈ నెల 14 వరకు బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు.. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు బిడ్లు తెరుస్తారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం జనరల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి కూడా టెండర్ పిలిచారు.


విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 38.40 కి.మీ మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదం కోసం పంపించారు. మొదటి కారిడార్ గన్నవరం నుండి పీఎన్‌బీఎస్ వరకు, రెండవ కారిడార్ పెనమలూరు నుండి పీఎన్‌బీఎస్ వరకు నిర్మిస్తారు. ఈ మేరకు విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి జాతీయ రహదారుల సంస్థ (NHAI) మహానాడు కూడలి నుంచి నిడమానూరు వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలోచన చేస్తోంది. ఇదే మార్గంలో రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు మెట్రో రైలు కూడా వెళ్లనుంది. అయితే దీని కోసం రెండు వేర్వేరు బ్రిడ్జిలు నిర్మిస్తే ఎక్కువ ఖర్చు అవుతుందని.. ఉమ్మడిగా 4.7 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడు పైన మెట్రో రైలుకు, కింద వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు ఉండవు అంటున్నారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అయ్యే ఖర్చును NHAI, APMRCLలు భరిస్తాయి. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ డీపీఆర్ తయారీ కోసం బిడ్లను ఆహ్వానించారు.. ఈమేరకు ఎంపికైన సలహా సంస్థ డీపీఆర్ తయారు చేస్తుంది. APMRCL కార్యకలాపాల కోసం జనరల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికి టెండర్ పిలిచారు. ఎంపికైన సలహా సంస్థ నాలుగేళ్ల పాటు సేవలు అందిస్తుంది.. దీని కోసం రూ.205 కోట్లతో బిడ్లు పిలిచారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది.. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు బిడ్లను తెరుస్తారు.. ప్రీబిడ్ సమావేశాన్ని 12న నిర్వహిస్తారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేసింది. ఇటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్ని కూడా వేగవంతం చేశారు.. ఈ మేరకు బిడ్ల వరకు ముందడుగు పడింది.