28న విజయవాడలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.


ఏఐకేఎంఎస్ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ..

ఏఐకేఎంఎస్ రాష్ట్ర సదస్సుకు తరలిరండి..


Dr. BR Ambedkar Konaseema: అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 28న విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో భూమి సమస్యలపై జరిగే రాష్ట్ర సదస్సుకు రైతు కూలీలు, కౌలు రైతులు, ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

ఏఐకేఎంఎస్ రాష్ట్ర సదస్సు పోస్టర్స్ ను సోమవారం ద్రాక్షారామ స్థానిక కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయంలో వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఏఐకేఎంఎస్ గత 50 సంవత్సరాలుగా రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై పోరాడుతుందని అన్నారు. తెలంగాణ, నక్సల్ బరీ, శ్రీకాకుళ, గోదావరి లోయ ప్రతిఘటనా పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం ఉద్యమిస్తుందని అన్నారు. సుమారు పది లక్షల ఎకరాలకు పైగా పోడు భూములు, బంజరు, సీలింగ్ , దేవాదాయ, ధర్మాదాయ భూములను ఆదివాసులకు, దళితులకు, పేదలకు పంచిందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వ్యవసారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి కుట్ర చేస్తుందని విమర్శించారు. 

దానిలో భాగంగానే 2020 సంవత్సరంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతాంగం ఢిల్లీని చుట్టుముట్టి సంవత్సరం కాలం పైగా ఆందోళన నిర్వహించారని, మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా మోడీ ప్రభుత్వ మెడలు వంచారని అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన డిజిటల్ అగ్రి మిషన్, నూతన వ్యవసాయక విధానాల పేరుతో ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయంగాన్ని కట్టబెట్టడానికి చూస్తుందని దుయ్యబట్టారు. నూటికి 70% మందికి పైగా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్ లో కేవలం 2.51% మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. 

స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు, పంటల కనీస మద్దతు ధర చట్టం వంటి వాటి ఊసే లేదని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడిచినా అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చే 20,000 రూపాయలు నేటికీ ఇవ్వలేదని అన్నారు. మిర్చి ధరలు విపరీతంగా పడిపోవడంతో మిర్చి పంట పండించిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. మిర్చి పంట పండించడానికి ఎకరానికి రెండు నుంచి మూడు లక్షలు వరకు పెట్టుబడి అయిందని, మిర్చి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని అన్నారు. 

క్వింటా మిర్చికి 25,000 గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు భూమి పంచడానికి ముఖం చాటేసే ప్రభుత్వం రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీకి ఐదు లక్షల ఎకరాల భూములను ఎలా దారాధత్తం చేస్తుందని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, వ్యవసాయ కూలీ, కౌలు రైతుల, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.         

ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు అంబటి కృష్ణ , చింత రాజారెడ్డి, గుర్రాల సత్యవేణి, వెంటపల్లి రామకృష్ణ, పట్టాభి, సత్యనారాయణ, దడాల శ్రీను, చిన్న తదితరులు పాల్గొన్నారు.