లక్షణాలు లేకుండానే మధుమేహం.. హెచ్చరిస్తున్న నిపుణులు!


WORLD NEWS: మధుమేహం.. గుండెపోటు.. రక్తపోటు.. ఇలా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు వయసుతో సంబంధం లేకుండా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సాధారణంగా మధుమేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉండడం గమనార్హం. మధుమేహం అంటే ఒకప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఇది అతి పెద్ద ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఈ మధుమేహం అనేది రావడానికి ముందు కొన్ని రకాల లక్షణాలను మనకు మన శరీరం తెలియజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పా పెట్టకుండానే.. ఎటువంటి లక్షణాలు లేకుండానే మధుమేహం వ్యాపించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


రాత్రికి రాత్రి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడం.. పైగా మధుమేహం బయటపడడంతో ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇలా చెప్పా పెట్టకుండా వచ్చే మధుమేహానికి గల కారణం ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీనిని ఎలా నివారించుకోవాలి? అనే విషయాలపై నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు. మరి హఠాత్తుగా వచ్చే ఈ మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

టైప్ 2 డయాబెటిస్ అనేది అందరిలో కనిపించే సమస్య. కానీ హఠాత్తుగా వచ్చే మధుమేహం మాత్రం అలా కాదు. ఉన్నట్టుండి రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగిపోతాయి. దీనికి కారణం పాంక్రియాటైటిస్ (క్లోమ గ్రంధి) వాపు.. దీనిపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయడం లేదా పాంక్రియాస్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు కూడా కారణం కావచ్చు. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఉన్నట్టుండి క్లోమగ్రంధి వాపుకు గురైన ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా మధుమేహ బారిన పడుతున్నట్లు చెబుతున్నారు.

మధుమేహానికి, క్లోమగ్రంధి ఆరోగ్యానికి సంబంధం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇకపోతే క్లోమగ్రంధి వాపు, క్యాన్సర్ వంటి సమస్యలు క్లోమగ్రంధి పనితీరును అస్తవ్యస్తం చేయడం వల్లే గ్లూకోజ్ మోతాదుల నియంత్రణ గాడి తప్పుతోందట. ఇకపోతే ఉన్నట్టుండి రక్తంలో గ్లూకోస్ స్థాయిలు హఠాత్తుగా పెరగడానికి కారణం ఏమిటంటే.. రక్తంలో గ్లూకోస్ మోతాదులను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ క్లోమ గ్రంధి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఈ గ్రంధి గాయపడినా లేక వాచినా లేదా దీనిపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసినా సరే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. క్రమంగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి.

అందుకే 50 సంవత్సరాలు పైబడిన వారిలో మధుమేహ లక్షణాలేవి లేకపోయినప్పటికీ గ్లూకోజ్ మోతాదులు పెరిగితే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కడుపు స్కానింగ్, క్లోమ గ్రంధి, ఎంజైముల విశ్లేషణతో అంతర్గత వాపు, కణితులు వంటి సమస్యలను మరింత తీవ్రతరం కాకముందే గుర్తించి సకాలంలో పరీక్షలు చేయించుకుంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యం అలవాటు ఉన్నవారు.. క్లోమం వాపుతో కణజాలం చచ్చుబడిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలట.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు దైనందిత జీవితంలో సరైన వ్యాయామాలు.. యోగా వంటివి చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అని.. ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా అరికట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now