మరో శుభవార్త.. ఆ ఎయిర్ పోర్ట్ భూసేకరణకు నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్!

HYDERABAD:వరంగల్ జిల్లా వాసుల కల త్వరలో నెరవేరబోతోంది. ప్రభుత్వం మాటిచ్చినట్టు శరవేగంగా మామునూరు ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో మరొక కీలక అడుగు ముందుకు పడింది. ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో వరంగల్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

205 కోట్ల రూపాయలు ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణకు నిధులు

మొత్తం 205 కోట్ల రూపాయలు ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణకు నిధులు విడుదల చేస్తున్నట్టు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మామునూరు వద్ద కొత్త బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు మార్చి నెలలో ఆమోదం తెలిపారు .ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ఫైలుపై సంతకం చేశారు.

శరవేగంగా పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఇంకా 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో భూసేకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తుంది. వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1935 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఎయిర్పోర్ట్ ఆ తర్వాత నిజాం పాలనలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారత వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడింది.

2018 నుండి మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడుగులు

అంతేకాదు అప్పట్లో వర్తక వాణిజ్యాలకు కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది 1981 వ సంవత్సరంలో మామునూర్ ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018 నుండి చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా చేయాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నారు . విమానాశ్రయ విస్తరణకు కావలసిన భూ సేకరణ చేస్తున్నారు.

భూసేకరణకు ప్రభుత్వం నిధులు

ఖిల్లా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, గాడి పల్లి, మామునూరు గ్రామాల నుంచి విమానాశ్రయ అభివృద్ధికి కొన్ని భూములను గుర్తించి అక్కడి రైతులతో, స్థానికులతో మాట్లాడి వాటిని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో భూసేకరణకు సంబంధించి రైతులకు చెల్లించవలసిన నగదు చెల్లించడం కోసం తాజాగా తెలంగాణ ప్రభుత్వం 205 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఏది ఏమైనా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి కీలక అడుగులు పడుతుండడం జిల్లా వాసులకు సంతోషం కలిగిస్తుంది.

 

WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now