HYDERABAD:నిద్రమత్తు కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలు ఘటనల్లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి.. తీవ్రగాయాల పాలయ్యారు. కానీ తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరచింది. నిద్రమత్తులో ఓ కార్ డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోయి ఏకంగా ఓ ఇంటి గోడపైకి ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంభీపూర్‌లో నిన్న ( జూలై 25, 2025 ) రాత్రి భారీ శబ్ధం వచ్చింది. దాంతో కంగారు పడ్డ స్థానికులు బయటికి వచ్చి చూడగా.. కారు వేగంగా వచ్చి ఇంటి గోడను ఢీ కొట్టినట్టు కనిపించింది. అసలు ఢీ కొట్టడం ఒక విషయం అయితే.. ఏకంగా ఇంటి గోడపైకి ఎక్కించడం ఏంటని షాక్‌కు గురవుతున్నారు. సదరు ఇంటి యజమానుల సమాచారం మేరకు దుండిగల్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో కారును కిందికి దింపారు.
ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా.. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకుని "నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రాణాలకే ముప్పు" అని హెచ్చరిక చేస్తున్నారు. రాత్రి వేళ ప్రయాణిస్తున్న డ్రైవర్లు సరైన విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.