గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు పెరుగుతున్నాయని తెలిపారు.
రూ.3.60 కోట్లతో అభివృద్ధి పనులు
కొమర్రాజులంక బ్రిడ్జి నుంచి కొత్తపేట–మందపల్లి ఏటిగట్టు వరకు రూ.90 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. రావులపాలెంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈతకోటలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అదే గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించారు. పొడగట్లపల్లిలో రూ.30 లక్షలు, గోపాలపురంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలకు భూమిపూజలు నిర్వహించారు.
ఆరు వెల్నెస్ సెంటర్లకు శంకుస్థాపన
అదేవిధంగా మండలంలోని ఈతకోట, గోపాలపురం–2, కొమర్రాజులంక, ముమ్మిడివరప్పాడు, రావులపాలెం గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.2.16 కోట్లతో నిర్మించనున్న ఆరు వెల్నెస్ సెంటర్లకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు.
మరిన్ని అభివృద్ధి పనులు ముందున్నాయి
గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొన్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రానున్న మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
