నగరంలోని గవర్నర్‌పేటలో ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ‘స్వరనర్తన’ సంగీత–నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆంధ్రనాట్య సంగమం” కార్యక్రమం ఆదివారం రాత్రి కళాప్రియుల మధ్య అత్యంత వైభవంగా ముగిసింది. శాస్త్రీయ నృత్యాభిమానులను అలరించిన ఈ కార్యక్రమం ఆంధ్రనాట్య వైభవాన్ని ఘనంగా ప్రతిబింబించింది.
కీ.శే. పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత గురు డా. కళాకృష్ణ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఆంధ్రనాట్య సంప్రదాయానికి జీవం పోసేలా రూపుదిద్దుకున్న ఈ వేడుకలో నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ సందర్భంగా శ్రీమతి పద్మామోహన్ దెందులూరి గారి ప్రత్యేక “నవ జనార్ధన పారిజాత” నృత్య ప్రదర్శన సభను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు గురు డా. కళాకృష్ణ గారు నట్టువాంగం మరియు నృత్య దర్శకత్వం వహించారు. అలాగే గత ఏడాది డిసెంబర్ 13, 2025న నిర్వహించిన ఆంధ్రనాట్య సంగమం పోటీలలో విజేతలైన విద్యార్థులు తమ ప్రతిభావంతమైన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి డా. దెందులూరి నళినీ మోహన్ (IFS–R) హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, ఏపీ సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డి. మునిరత్నం నాయుడు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఏ.వి. శేషసాయి పాల్గొన్నారు. ఆత్మీయ అతిథులుగా పద్మశ్రీ శ్రీమతి ఉమామహేశ్వరి మరియు గురు డా. కళాకృష్ణ గారు కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు.
ఆంధ్రనాట్య పరిరక్షణకు విజ్ఞప్తి
ఆంధ్రనాట్యాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంగీత–నృత్య కళాశాలల్లో ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టాలని కళాభిమానులు ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ శాస్త్రీయ నృత్య రూపం ద్వారా ఆంధ్రుల సాంస్కృతిక వైభవాన్ని తరతరాలకు అందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
అలాగే ఆంధ్రనాట్య పునరుజ్జీవనానికి ఎనలేని సేవలందించిన పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ గారి పేరుతో ఒక ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పురస్కారాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాంస్కృతిక వర్గాలు కోరాయి. ఇది ఆంధ్రనాట్య కళాకారులకు ప్రోత్సాహంగా నిలవడమే కాక, ఈ అపూర్వ నృత్య సంప్రదాయానికి గౌరవాన్ని చేకూర్చే కీలక నిర్ణయంగా నిలుస్తుందని తెలిపారు.
విజేతల వివరాలు
ఈ సందర్భంగా జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కళాకారులు, గురువులు, అతిథులు, ప్రేక్షకులందరికీ ‘స్వరనర్తన’ వ్యవస్థాపకులు శ్రీమతి పద్మామోహన్ దెందులూరి, శ్రీమతి కర్నాటి నవతతో పాటు కార్యనిర్వాహక బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

