భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు: మే నెల అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి కార్మికుడు తగు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సింగరేణి వైద్యులు డాక్టర్ పి శేషగిరిరావు అన్నారు. పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ దండమూడి రాంబాబు ఆదేశాల మేరకు పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఓసి 2లో ఓబి వెలికితీత పనులు నిర్వహిస్తున్న వి పి ఆర్ (దుర్గ ఇన్ ఫ్రా) ఓబి కంపెనీలో జరిగిన "వేసవి నేపథ్యం కార్మికుల ఆరోగ్య సూత్రాలు" అనే అంశంపై జరిగిన కార్మికుల అవగాహన ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో వాటిని మన శరీరం తట్టుకునే విధంగా ప్రతి కార్మికుడు ఎక్కువ పరిశుభ్రమైన నీరు, చల్లని మజ్జిగ తాగాలని మద్యానికి దూరంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా ఆహార నియమాలు పాటించాలని మాంసాహారానికి ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలని తగు విశ్రాంతి కూడా తీసుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు.
అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయాలనే అంశం మీద కూడా ఆయన రక్షణ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగబాబు, తోట రామ్ శంకర్, సీనియర్ పిఓ ఎండి మదార్ సాహెబ్, ఓ బి కంపెనీ ఇన్ ఛార్జ్ బిపిన్ తదితరులు పాల్గొన్నారు.