ANDRAPRADESH: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్‌పార్టీ ఏపీ చీఫ్ షర్మిల తొలిసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని, అందుకే అవి మొడుల్లా మారుతున్నాయని రాజోలు పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇదేసమయంలో మంత్రులు కూడా ఫైరయ్యారు. ఇక, దీనిపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది.
ఇదిలావుంటే.. తాజాగా ఇవే వ్యాఖ్యలపై షర్మిల రియాక్ట్ అయ్యారు. `దిష్టి` వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ కొబ్బరి రైతులను అవమా నించారని ఆమె ఆరోపించారు. ఇది మూఢనమ్మకమని.. దీనిని రైతుల సమస్యలపై రుద్దుతున్నారని ఆమె చెప్పారు. సమస్యను సమస్యగా చూసి.. అధికారంలో ఉన్నవారు పరిష్కరించాల్సిందిపోయి.. దిష్టి అంటూ.. వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సముద్ర తీరం కారణంగా ఉప్పునీటితో కొబ్బరి చెట్లు మోడు వారుతున్నాయని.. ఈ సమస్యను అక్కడి రైతులు ఎవరిని అడిగినా చెబుతారని.. దీని పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు.
దీనికి గాను రూ.3500 కోట్లను తక్షణమే కేటాయిస్తే.. రైతులకు మేలు జరుగుతుందన్న షర్మిల.. సమస్యను పరిష్కరించకుండా పచ్చదనానికి, కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇక, రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ వ్యాఖ్య లు చిచ్చు రేపాయని.. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యం లో డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆయన బేషరుతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
కాగా.. రాజోలు నియోజకవర్గంలో `పల్లె పండుగ-2.0`లో పాల్గొన్న పవన్‌కల్యాణ్.. ఇక్కడి రైతులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన దెబ్బతిన్న కొబ్బరి చెట్ల విషయాన్ని ప్రస్తావిస్తూ.. వీటికి దిష్టి తగిలిందని.. అందుకే మోడుల్లా మారిపోయా యని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తెలంగాణ విభజన అంశాన్నిప్రస్తావించారు. ఇది రాజకీయంగా వివాదానికి దారి తీసింది. కాగా.. ఈ విషయంలో రాజకీయ పార్టీలు మౌనం పాటిస్తే.. బెటర్ అని తటస్థులు సూచిస్తున్నారు.
