రఘురామ ఫ్యాన్స్ నిరసన... తెరపైకి కొత్త ట్రెండ్!.. ఏదిఏమైనా ఇరుపార్టీలు ఆర్ ఆర్ ఆర్ కి అరచేతి మందం చూ....!?


భీమవరం ప్రతినిధి: ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజుకు ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన ఆయన అనతికాలంలోనే ఆ పార్టీకి బద్ద శత్రువుగా మారారు! ఈ సమయంలో టీడీపీ, జనసేన లకు పరోక్షంగా దగ్గరయ్యారు.. ఫలితంగా ఒక వర్గం మీడియాలో అధిక ప్రాధాన్యత సంపాదించారు! దీంతో.. ఈసారి టీడీపీ - జనసేన కూటమి నుంచి ట్రిపుల్ ఆర్ బరిలోకి దిగడం కన్ ఫాం అనే విషయం నాడే ప్రజల్లో ఫిక్స్ అయిపోయింది! 

అయితే.. కూటమిలో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీ ఖాతాలో పడింది. అయితే... రఘురామకు కాకుండా శ్రీనివాస వర్మ అనే బీజేపీ సీనియర్ నేతకు టిక్కెట్ కేటాయించింది. వాస్తవానికి రఘురామ కృష్ణంరాజుని అకామిడేట్ చేయడం చంద్రబాబు నైతిక బాధ్యత అనే కామెంట్లూ వినిపించాయి. ఏది ఏమైనా... గెలుపు ఓటముల సంగతి దేవుడెరుగు.. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కనీసం పోటీ చేసే అవకాశం కూడా ట్రిపుల్ ఆర్ కు లేకుండా పోయింది! 

దీంతో... ఈ విషయంపై స్పందించిన రఘురామ.. ఈ క్రెడిట్ ని జగన్ ఖాతాలో వేశారు. తనకు టిక్కెట్ దక్కకపోవడానికి జగనే కారణం అని చెప్పుకొచ్చారు. మరోపక్క ఆయన అభిమానులు తీవ్రంగా హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా వారు సరికొత్తగా నిరసన కార్యక్రమాలకు తెరలేపారు. ఇందులో భాగంగా... " వి స్టాండ్ విత్ ఆర్.ఆర్.ఆర్." అనే నినాదంతో రఘురామకృష్ణంరాజు అనుచరులు, అభిమానులు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా... ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని.. నరసాపురం ఎంపీ టిక్కెట్ రాకుండా జగన్ కుటిల యత్నం చేశారని.. ట్రిపుల్ ఆర్ కు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని.. బీజేపీతో కలిసి జగన్ పన్నాగం పన్నారని.. ఏపీ కోసం పోరాడిన వీరోచిత పోరాట యోధుడు ఆర్.ఆర్.ఆర్. అని చెబుతూ... ఆయనకు న్యాయం జరగడం కోసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆర్.ఆర్.ఆర్. అభిమానులు పెద్ద ఎత్తున కదలిరావాలని పిలుపునిచ్చారు. 

కాగా... నరసాపురం ఎంపీ టిక్కెట్ తనదే అని రఘురామ కృష్ణంరాజు మొదటినుంచీ ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సభ "జెండా" వేదికపైనా ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు కచ్చితంగా తనకు టిక్కెట్ ఇస్తారని నమ్మారని చెబుతుంటారు. అయితే అనూహ్యంగా నరసాపురం టిక్కెట్ బీజేపీకి వెళ్లడం, అది కాస్తా తమ సొంతపార్టీ నేత వర్మకు కేటాయించుకోవడంతో... ఆర్.ఆర్.ఆర్. ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా మిగిలిపోయారనే ఆవేదన ఆయన అభిమానుల్లో వ్యక్తమయ్యింది!