తాడేపల్లిగూడెం: కాపుల నిర్ణయమే రానున్న ఎన్నికల్లో కీలకం కానుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో గురువారం కాపుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ కాపులు అంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని తెలిపారు. రంగాను హత్య చేసింది, తుని రైలు సంఘటనలో దహనం చేసింది చంద్రబాబు కారణం అని తెలిపారు.
కాపులను మచ్చిక చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చారని తెలిపారు. కాపులకు చెందిన యువత చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల రెండు మూడు తరాలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిపోయారని అన్నారు. పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఆయన వద్ద ఊడిగం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి పార్టీని పెట్టానని చెప్పారని ఇప్పుడు చంద్రబాబుకు కాపులను తాకట్టు పెట్టారని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్టే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాపు ఓట్లే కీలకం కానున్నాయని తెలిపారు. అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం సమస్తం త్యాగం చేశారని స్పష్టం చేశారు. భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో దిగిందని, ఎవరి సొమ్ములతో రాష్ట్రాన్ని పాలిస్తారని ప్రశ్నించారు. తెల్ల కాగితం మీద ప్రభుత్వ సొమ్ముతో పథకాల అమలు చేయమని రాసిస్తారా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాచుకో దోచుకో నినాదంతో పాలించారని విమర్శించారు. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రజలను రోడ్ల మీదకి తీసుకెళ్తే జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చిందని తెలిపారు. కాపులు అంటే జగన్కు ఒక ప్రత్యేక అభిప్రాయము అభిమానము ఉందని అందుకే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన కొట్టు సత్యనారాయణ కు ఉపముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి పదవులను కట్టబెట్టారని అదేవిధంగా ఈ నియోజకవర్గానికి చెందిన తనకు క్యాబినెట్ హోదా ఇచ్చి అప్సడా వైస్ చైర్మన్ గా పదవులను ఇచ్చి కాపులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారని రఘురాం వివరించారు.
మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి గల తేడాను కూడా పసల వివరించారు. ఈ సదస్సులో మైలవరపు సుబ్బారాయుడు, కైగాల శ్రీనివాస్, ముప్పిడి సంపత్ కుమార్, పసల చంటి వైసిపి, కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.