డిప్యూటీ సీఎం గీత అంటూ... జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు !


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు చివరి సభలో వైఎస్ జగన్ భారీ స్టేట్మెంట్ ఇచ్చి టీడీపీ కూటమిని ఇరకాటంలో పడేశారు. పిఠాపురం లో ఆయన నిర్వహించిన చివరి ఎన్నికల సభలో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగా గీతను గెలిపిస్తే తమ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిని చేస్తామని అత్యంత కీలక ప్రకటన చేశారు. 


ఆమె ఎమ్మెల్యే కాదు డిప్యూటీ సీఎం గా మీ ముందుకు వస్తుంది, పిఠాపురం సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని జగన్ అన్నారు వంగా గీత అందరికీ అందుబాటులో ఉడే నాయకురాలు అని ఆమెను గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఒకసారి జరిగితే పొరపాటు రెండవసారి జరిగితే గ్రహపాటు మూడు నాలుగు సార్లు జరిగితే మాత్రం అది అలవాటు అంటూ పవన్ పెళ్ళిళ్ళ మీద కామెంట్స్ చేశారు. దీనిని మహిళా లోకం ఆలోచించాలని అన్నారు. పవన్ వ్యక్తిత్వం ఏమిటి అన్నది చూడాలని అన్నారు. ఇలాంటి వారు ఎమ్మెల్యేగా నెగ్గితే ఏమైనా ఉంటుందా అని కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఓటు వేయకూడదో ఆయన మరో మాట చెప్పారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబుకు మద్దతుగా నిలిచి ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలలో సంతకాలు చేసిన పవన్ వాటిలో ఒకటి బాబు నెరవేర్చకపోయినా మద్దతుగా ఉన్నారని బాబు మోసాలలో ఆయన కూడా భాగస్వామి అని అన్నారు. 

ఇపుడు 2024 ఎన్నికల వేళ మళ్ళీ ఆ ముగ్గురూ కూటమి కట్టి వస్తున్నారు అని అన్నారు. తాను 70 వేల కోట్ల రూపాయలు ఏటా వెచ్చిస్తూ సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నానని టీడీపీ కూటమి అలవి కానీ హామీలను లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తామని చెబుతోందని అది సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. ఈ కూటమి పొరపాటున అధికారంలోకి వచ్చినా బాబు పవన్ మోసాలే చేస్తారు తప్ప హామీలు నెరవేర్చరు అని అన్నారు. గాజువాక భీమవరం అయిపోయింది ఇపుడు పిఠాపురం అంటూ వచ్చిన పవన్ తనకు జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడని అలాంటి వ్యక్తి అందుబాటులో ప్రజలకు ఉంటారా అన్నది ఆలోచించాలని జగన్ కోరారు. వైసీపీని గెలిపిస్తే పిఠాపురం అభివృద్ధి చేస్తామని అన్నారు. 
 
ఇదిలా ఉండగా జగన్ సభలో వంగా గీత కన్నీటి పర్యంతం అయ్యారు. తన పుట్టుకను ప్రశ్నిస్తూ అవమానం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పిఠాపురంలో పుట్టలేదని అంటున్నారని, కానీ తాను చనిపోతే కనుక తన అంతిమ యాత్ర పిఠాపురంలోనే జరగాలని ఆమె భావోద్వేగంతో కూడిన స్వరంతో విన్నపం చేసుకున్నారు. మరో వైపు చూస్తే తనను ఈసారి గెలిపించాలని అభివృద్ధిపథంలో పిఠాపురాన్ని నడిపిస్తాను అని చెప్పుకొచ్చారు. కొంగు చాచి అడుగుతున్నాను అని ఆమె జగన్ సమక్షంలోనే కన్నీరు పెట్టడంతో జగన్ ఆమెను వారించారు. మరో వైపు చూస్తే తాను 102 డిగ్రీల జ్వరంతో కళ్ళు తిరిగి పడిపోతే ఒక జనసేన సోదరుడు నాటకాలు ఆడానని విమర్శించారని ఇదెక్కడి దారుణం అని ఆమె వాపోయారు. 

తాను జ్వరం వస్తే హైదరాబాద్ పారిపోలేదని, పిఠాపురంలోనే ఉన్నానని అక్కడి ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్పారు. ఆఖరికి ఆడవాళ్ల అనారోగ్యాన్ని సైతం అవమానిస్తారా అని వంగా గీత మండిపడ్డారు. మొత్తం మీద చూస్తే కనుక వంగా గీత ఎమోషన్ అయ్యారు. జగన్ ఆమెను డిప్యూటీ సీఎం చేస్తాను అని చెప్పిన తరువాత ఆమెలో ఫుల్ జోష్ కనిపించింది. మొత్తం మీద పిఠాపురం ఓటర్లు తీర్పు ఎలా ఇస్తారో చూడాలని అంటున్నారు.