24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పుతిన్-కిమ్ తో చర్చలు..!


అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు కమ్యూనిస్ట్ దేశాల అధినేతలు, అదీ నియంతలుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు నేతలు ఒకే చోట భేటీ అయితే... అంతకు మించిన చర్చ ఏముంటుంది. ఈ కీలక పరిణామానికి ఉత్తర కొరియా వేదిక కాబోతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ గత 24 ఏళ్లలో తొలిసారి ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తో ఆయన భేటీ కాబోతున్నారు.


రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించాక రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశాల్లో పర్యటించబోతుండటం కూడా అరుదుగా మారింది. దీంతో ఇప్పుడు ఆయన ఉత్తర కొరియా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కోవిడ్ తర్వాత ఏ ప్రపంచ దేశాధినేతనూ తన దేశంలో కలవని ఉత్తరకొరియా నియంత కిమ్ కు కూడా ఇదే తొలి ఆతిధ్యం. కిమ్ జోంగ్ ఉన్ గత సెప్టెంబర్ పుతిన్‌కు ఆహ్వానం పంపడంతో ఆయన ఇప్పుడు పర్యటిస్తున్నారు.

పుతిన్ చివరిసారిగా జూలై 2000లో పాంగ్ యాంగ్ ను సందర్శించారు. ఆ తర్వాత మళ్లీ వెళ్లలేదు. కానీ 24 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా ఆయుధాల కోసం ఇప్పుడు కొరియాకు పుతిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. పుతిన్ పర్యటన వెనుక సంచలన అజెండా ఉందంటూ పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. అలాగే ఇరుదేశాల మధ్య కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం రెచ్చగొట్టేది కాదని, ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉద్దేశించినది కాదని తెలిపారు.

పుతిన్ రాక సందర్భంగా ప్యాంగ్ యాంగ్ వీధుల్లో రష్యా జెండాలు రెపరెపలాడుతున్నాయి. 24 ఏళ్ల తమ దేశంలో పర్యటిస్తున్న కమ్యూనిస్ట్ మిత్రదేశం అధినేతకు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటనతో రష్యా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు. ఉత్తర కొరియా పర్యటన తరువాత, పుతిన్ రష్యాతో కమ్యూనిస్ట్-పాలిత వియత్నాం సంబంధాల ప్రదర్శనలో భాగంగా హనోయికి వెళ్లాల్సి ఉంది. పుతిన్ టూర్ పై స్పందించిన అమెరికా, దీనిపై తమకు ఆందోళన లేదని, కానీ రష్యా-ఉత్తరకొరియా సంబంధాలపైనే ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది.