న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరైంది. రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూజీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ నేపథ్యంలో 48 గంటలపాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ కు సంబంధించి గురువారం ఉదయం తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జీ న్యాయ్ బింగూ.. అదే సాయంత్రం బెయిల్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
అయితే, బెయిల్ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటపాటు స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. దీంతో తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు వీలు కలుగుతుందని విన్నవించింది. అయితే, ఈడీ వాదనను తోసిపుచ్చిన రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ రూ. 100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ బుధవారం కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లు తెలిపింది. అయితే, పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జీషీట్లో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో కూడా కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదని తెలిపారు.
\కింది కోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10 సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు. మార్చి 21న అరెస్ట్ చేసిన క్రమంలో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం ఆయనకు బెయిల్ లభించింది.