టాలీవుడ్ లోకి ఇతర భాషల హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఫ్రెష్ నెస్ కోసమో, క్రేజ్ కోసమో, అందాల ఆరబోతకు అడ్డుచెప్పరనో తెలియదు కానీ.. ఒకప్పుడు మన దర్శక నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్ల వైపు చూసేవారు. కోట్లు కుమ్మరించి ఉత్తరాది భామలను తీసుకొచ్చేవారు. తర్వాతి రోజుల్లో కన్నడ కస్తూరీలు, మలయాళ ముద్దుగుమ్మలను తీసుకొచ్చారు. ప్రస్తుతం తెలుగులో పరభాషా కథానాయిక హవానే కొనసాగుతోంది. ఈ క్రమంలో మాలీవుడ్ భామ మమిత బైజు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
'ప్రేమలు' వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మమిత బైజు. తన క్యూట్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్, స్మైల్ తో ఆకట్టుకొని అమ్మడు యూత్ కి క్రష్ గా మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఎస్.ఎస్. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రశంసలు అందుకోవడంతో.. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి మమిత మీద పడింది. ఇప్పటికే ఆమె కొన్ని తెలుగు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మమిత బైజు తన మొదటి తెలుగు చిత్రానికి సైన్ చేసిందని, అది కూడా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో అని టాక్ వినిపిస్తోంది.
'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ రూపొందించనున్నట్లు సమాచారం. దీని కోసం మమితా బైజుని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, తమిళ మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేసే ఆలోచనతో ప్రదీప్ కు జోడీగా మమితను ఫిక్స్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ ఏడాదే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
మమిత బైజు 2017లో 'సర్వోపరి పాలక్కారన్' అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'కృష్ణం', 'స్కూల్ డైరీ', 'ఆపరేషన్ జావా', 'ఖో ఖో', 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం', 'రామచంద్ర బాస్ & కో' వంటి చిత్రాల్లో అలరించింది. గతేడాది వచ్చిన 'ప్రేమలు' మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇది తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించింది. 'రెబల్' చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇదే క్రమంలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈ మలయాళ బ్యూటీ తెలుగులో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.