గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదంటూ అధికారులపై వీరిద్దరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి.. ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వాధినేతలు ప్రభుత్వ అధికారులపై విరుచుకుపడటమే మార్గమా? వారికి మరో దారి లేదా? అన్నది ప్రశ్న. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఈ తీరు మార్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం ఉందనిపించక మానదు. తాజాగా జరుగుతున్నఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మధ్య జరిగిన సంభాషణే దీనికి నిదర్శనం.
గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదంటూ అధికారులపై వీరిద్దరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు తమ సమాధానాలుగా.. ‘‘ఔను.. కాదు.. వర్తించదు.. ఉత్పన్నం కాదు’’ లాంటి పొడి పొడి సమాధానాల్ని ఇచ్చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇంతకు మించి మరే రీతిలో సమాధానాలు ఇవ్వలేరా? అంటే.. ఇవ్వొచ్చు.
కానీ.. దశాబ్దాలుగా ఇదే తీరులో సమాధానాలు చెప్పటం అలవాటైంది. ఒకవేళ.. వివరంగా.. సమగ్ర సమాధానాన్ని కోరుకున్న వేళలో.. దానికి సంబంధించిన రాతపూర్వక ఉత్తర్వులను అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇచ్చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు.
ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు.. ఈ తీరును ప్రదర్శించే అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చేసి.. ఒకవేళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న విషయాన్ని చెప్పేస్తే మరోలా ఉండేది. అందుకు భిన్నంగా.. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న విధానాలకు ముందస్తు జాగ్రత్తలతో మంగళం పాడకుండా.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం సమస్యకు పరిష్కారం కాదన్నది మర్చిపోకూడదు. పంచాయితీల నిధుల మళ్లింపు విషయంలోనూ అధికారుల ఇచ్చిన సమాచారంపై పవన్ అసంత్రప్తి వ్యక్తం చేశారు.
ఎస్సీ.. ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాధానం సరిగా లేకపోవటాన్ని తప్పు పట్టొచ్చు. కానీ.. ఈ తరహా సమాధానాలు చెప్పే వీలుందన్న విషయాన్ని గుర్తించి.. ముందస్తుగానే హెచ్చరించి ఉంటే సరిపోయేది. అలా చేయకుండా అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేయటం ద్వారా కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి? అన్నది ప్రశ్న. ఈ విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిదంటున్నారు.