వైసీపీలో నంబర్ టూ గా చలామణీ అవుతున్న ఆ పార్టీకి రాజ్యసభలో పక్ష నాయకుడు వి విజయసాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో అన్ని పార్టీలతో మంచి పరిచయాలు కలిగిన వారుగా ఉంటారు. ఆయన తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆగస్టు ఒకటో తేదీన నేను కేంద్ర హోం మంత్రిని కలిశాను అని సాయిరెడ్డి ట్వీట్ చేయడం కూడా జరిగింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లుగా తెలిపారు. ఇక అమిత్ షా ఇంతటి బిజీ షెడ్యూల్ లోనూ తనకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సైతం తెలియచేశారు.
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి గత వారం రోజుల వ్యవధిలో హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది రెండోసారి. మరీ ఇలా వరస భేటీలు ఆయన అమిత్ షాతో వేస్తూండడం పట్ల ఢిల్లీ స్థాయిలోనూ ఏపీలోనూ రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. అమిత్ షాతో భేటీలు ఎందుకు ఏమిటి అన్నది బయటకు తెలియకపోయినా పుకారులు అయితే షికారు చేస్తున్నాయి.
విజయసాయిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారు అన్నదే ఆ పుకార్ల సారాంశం. వైసీపీలో కీలక నేతగా జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బీజేపీ వైపు టర్న్ తీసుకుంటారా అన్నదే ఇపుడు అంతటా సాగుతున్న చర్చ. నిజంగా అలా జరిగితే కనుక వైసీపీకి అది బిగ్ షాక్ కింద లెక్క అని అంటున్నారు.
అయితే విజయసాయిరెడ్డి జూలై 24న ఢిల్లీలో వైసీపీ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలను కీలక నేతలను తీసుకుని రావడంలో ముఖ్య పాత్ర పోషించారు. దీంతో పాటుగా ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందని జాతీయ స్థాయిలో మీడియా కోడై కూస్తోంది. బీజేపీ నుంచి ఏ ఒక్కరూ ఈ ధర్నాకు రాకపోవడం ఎన్డీయేకు బద్ధ వ్యతిరేక పార్టీలు హాజరు కావడం జగన్ కూడా వారితోనే గడపడంతో డౌట్లు ఎన్నో ఈ ధర్నా తరువాత అందరికీ కలిగాయి.
ఏపీలో కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నందువల్ల బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది అని కూడా అంటున్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగా ఇండియా కూటమికి అనుకూలంగా విజయసాయిరెడ్డి వంటి వారు కూడా ఆయా సందర్భాల్లో ప్రకటనలు చేసినట్లుగా చెబుతున్నారు.
అంతే కాదు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కూడా ఇండియా కూటమికి మద్దతుగా విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. దాంతో వైసీపీ ఇండియా కూటమికి బహు దగ్గర అన్న విషయం కూడా ప్రచారంలోకి వచ్చేసింది.
ఈ నేపధ్యంలో వరసబెట్టి రెండవసారి అమిత్ షాను విజయసాయిరెడ్డి కలుసుకోవడం ఆయనను కలుసుకున్నట్లుగా ట్వీట్ చేస్తూ ఆయన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంతో రాజకీయంగా సరికొత్త అర్ధాలను ఈ భేటీ మీద అంతా వెతుకుతున్నారు. ప్రజా సమస్యల మీద చర్చించాను అని విజయసాయిరెడ్డి చెబుతున్నప్పటికీ వరం వ్యవధిలో రెండోసారి కలుస్తూ ప్రజా సమస్యలు అని పేర్కొనడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఏ ప్రజా సమస్యలు చర్చిస్తున్నారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది.
ఇవన్నీ చూసిన వారు స్థూలంగా ఒక అభిప్రాయానికి వస్తున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడానికి చూస్తున్నారు అన్నదే ఆ పుకార్లు నుంచి వస్తున్న విషయం అని అంటున్నారు. సేఫ్ జోన్ లో ఉండాలంటే బీజేపీయే శరణ్యం అని విజయసాయిరెడ్డి భావిస్తున్నారా అందుకే వారం తేడాలో రెండు సార్లు అమిత్ షాతో భేటీలు వేశారా అన్న చర్చ సాగుతోంది.
ఇక అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టమే. ఆయనే అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికీ కూడా కీలకమైన వారు. అటువంటి అమిత్ షా కూడా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అని కూడా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. ఈ భేటీ మీద వస్తున్న పుకార్లు నిజాలా లేక అబద్ధాలా తేలే సమయం దగ్గర్లోనే ఉందని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.