విజయనగరం క్రైం: గంజాయి అక్రమ రవాణా, నిరోధంపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒక వ్యక్తి నుంచి మోటారు సైకిల్, గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఆ వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టక్కి చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం వాహన తనిఖీలు చేపట్టారు.
వాహనం సీటులో స్పాంజ్‌కు బదులుగా గంజాయిని కుక్కి ఒడిశాలోని సుంకి నుంచి రాయగడకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా అంపనీ పోలీసు స్టేషన్ పరిధిలోని హరిప్రసాద్ హంసా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 20 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మల్కనగిరి జిల్లా గురసేతు గ్రామానికి చెందిన జిను పంగీ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నారని, పతి సిగోల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్టు గుర్తించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.
బొబ్బిలి పట్టణ పరిధిలో..
బొబ్బిలి పట్టణ పరిధిలోని శ్మశాన వాటిక మైదానంలో బొబ్బిలి సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాకు చెందిన నాగాలాపురం లోహిత్, అలియాస్ లోహిత్ భరత్ నుంచి ఆరు కిలోలు, బొబ్బిలి పట్టణానికి చెందిన చింతాడ సారఽథి అలియాస్ నాని నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బొబ్బిలికి చెందిన శిమిడి ప్రేమ్ కుమార్, లంకా నిఖిల్, దేవుపల్లి చందన్ అలియాస్ భంజు గంజాయి వ్యాపారంలో సహాయ పడినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరితో పాటు ముగ్గురు జువెనైల్స్ కూడా అక్రమంగా గంజాయిని తరలించడంలో సహకరించడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. లోహిత్, భరత్‌పై ఇప్పటికే పార్వతీపురం పట్టణంలో గంజాయి కేసు నమోదైందని తెలిపారు. ఈ సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌బీ సీఐలు విజయనాఽథ్, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి రవాణాదారుడి అరెస్టు..
విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రహదారిలో వ్యక్తిని అదుపులోకి తీసుకుని నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. రైల్వే స్టేషన్ రహదారిలో ఎస్‌ఐ నవీన్‌పడాల్, ఎస్‌బీ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, ఒడిశా రాష్ట్రం సబల్‌పూర్ జిల్లాలోని బిక్సిరా గ్రామానికి చెందిన గోవర్థన్ పటేల్ వద్ద గంజాయి దొరికింది. అదే ప్రాంతానికి చెందిన మనోజ్ వ్యక్తి ద్వారా విజయనగరం వచ్చారని తెలిపారు. గోవర్థన్ పటేల్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.