ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని జి.కొండూరులో, మైలవరం మండల పరిధిలోని పూరగుట్ట లే అవుట్లలో ఇళ్ల నిర్మాణలను ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు గురువారం పరిశీలించారు. నివాసితులతో మంత్రి పార్థసారథి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, తదితర మౌలిక సదుపాయాలు లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ.. 2025 మార్చి వరకు కొత్తగా కాలనీలు మంజూరు కావని తెలిపారు. స్థలం తీసుకొని ఇళ్ళు నిర్మించుకొని వారికి అవగాహన కల్పించి త్వరితగాతిన నిర్మించుకునేలా చూడాలన్నారు. మైలవరం పూరగుట్టలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. పూరగుట్ట లే అవుట్ లో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ కింద నిధులు కేటాయించి రహదారి అభివృద్ధి చేస్తామని, ఇక్కడ రహదారులు అభివృద్ధి చెందితే ఇంకా ఎక్కువ మంది లబ్దిదారులు గృహానిర్మాణాలు పూర్తి చేస్తారన్నారు.
ఇళ్ళు కట్టుకునే వారికి ఆన్‌లైన్, బిల్లుల చెల్లింపు ప్రక్రియ విధానాలను సరళీకృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బేస్‌మెంట్ లెవల్ పూర్తి అయిన తరువాత పిల్లర్లపై స్లాబ్ వేసుకుంటే బిల్లు చెల్లించే అంశంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. కొందరు లబ్దిదారులు తాపీమేస్త్రీల మాటలు విని, ఇంటి నిర్మాణానికి హెవీ డిజైన్లు వాడుతున్నారని, దీనివల్ల ఖర్చు పెరుగుతుందన్నారు. ఎకానమీ డిజైన్లో ఇళ్ళు కట్టుకునే విధంగా లబ్దిదారులను ప్రోత్సహించాలని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... పూరగుట్టలో బోర్లు, రహదారుల అభివృద్ధి, జంగిల్ క్లియరెన్స్, తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని అన్నారు. పెండింగ్ బిల్లులను కూడా వెంటనే చెల్లిస్తారని, గతంలో ఇల్లు మంజూరు అయి ఉన్నవారు మార్చి లోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే అని... లేకుంటే వారికి మళ్ళీ భవిష్యత్తులో పక్కాగృహాలు మంజూరు కావని ఎమ్మెల్యే వెల్లడించారు.