ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.


ఏలూరు, లింగపాలెం: చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, కలరాయనగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. 

మొదట టిడిపి సీనియర్ నాయకుడు నందిగం సీతారామ తిలక్ (బాబి) రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వివిధ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఉచిత వైద్య శిబిరానికి తరలివచ్చారు. మధుమేహం, రక్తపోటు జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప్ రెడ్డి, స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ శృతి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ శిబిరానికి తరలివచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో గుండె స్కానింగ్ ఉచితంగా చేశారు. 

రక్తపోటు, మధుమేహం నిర్ధారణ పరీక్షల నిమిత్తం రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను వైద్య నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముసునూరి గంగాధర్, రాంబాబు, శ్రీకృష్ణ వరప్రసాద్, నందిగం శ్రీధర్, కొల్లి సుధాకర్, గద్దల సాగర్, తదితరులు పాల్గొన్నారు.