సూర్యాపేట దేవరపల్లి నిర్మాణ దశలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వాలి


టి.నరసాపురం/ఏలూరు: సూర్యాపేట-దేవరపల్లి నిర్మాణ దశలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వాలనీ కోరుతూ బుధవారం నాడు ఖమ్మంలో నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కర్నె దివ్య గారికి ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు టి నర్సాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత యస్ డి నా సర్ పాషా విలేకరులకు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారిలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం టీ నర్సాపురం మండల ప్రజలు ఎంతో విలువైన తమ పచ్చని పొలాలను తోటలను కూడా త్యాగం చేశారన్నారు. టీ నర్సాపురం మండలానికి చెందిన అనేకమంది యువతి యువకులు పలు కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాల రీత్యా నివసిస్తున్నారనీ దాంతో ఈ మండలం నుండి హైదరాబాద్ కి వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయన్నారు.

జీలుగుమిల్లి-టి.నరసాపురం మధ్య ప్రాంతంలో ఆయుధ కర్మాగారం ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టనున్న కారణంగా ఇక్కడ నుంచి ఉద్యోగులు విశాఖ, హైదరాబాద్ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని వాటిని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారిలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వాలని కోరారు.

ఈ ప్రాంత ప్రజల అవసరాలను, త్యాగాలను గుర్తించి మండల కేంద్రం టీ నర్సాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఎగ్జిట్ ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మానికి చెందిన మిత్ర బృందం ఊరుకొండ శ్రీనివాస్, మిట్టకోలు లక్షణాద్రి, ఎండి అహ్మద్, ఎండి ఫిరోజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.