జిల్లాలో పల్లె పండగ కార్యక్రమం ద్వారా 983 సిసి రోడ్లు నిర్మాణం: జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వెల్లడి


పురోగతిలో ఉన్న పనులు డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాలి..
సంక్షేమముతో పాటు రాష్ట్ర అభివృద్ధి..
చింతలపూడి నియోజకవర్గంలో 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లు ప్రారంభం..



ఏలూరు/కామవరపు పేట: ఏలూరు జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మొదట విడతగా 983 సిసి రోడ్లు నిర్మాణానికి 92.02 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. గురువారం చింతలపూడి నియోజవర్గంలో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్థానిక శాసనసభ్యులు సొంగా రేషన్ కుమార్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కామవరపుకోటలో రూ.70 లక్షలతో, ఆసన్నగూడెంలో రూ.60 లక్షలు MGNREGS నిధులతో నిర్మించిన సిసి రోడ్లను కలెక్టర్, శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ రెండు గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 92.02 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిలో చింతలపూడి నియోజకవర్గానికి 187 రోడ్లు పనులకు గాను రూ.19.03 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పురోగతిలో ఉన్న పనులు డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

గురువారం చింతలపూడి నియోజకవర్గంలో 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రెండో విడతలో డ్రైనేజీలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో రహదారులు సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రోడ్డు నిర్మాణం కార్యక్రమం చేపట్టిందని, సంక్రాంతికి జిల్లాలో మంజూరు చేసిన సిసి రోడ్లను పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించారు. 
సంక్రాంతి పండుగ నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించమన్నారు.

చింతలపూడి నియోజకవర్గంలో పల్లె పండుగ ద్వారా మంజూరు చేసిన సిసి రోడ్లు పనులను త్వరితగతిని పూర్తి చేయించిన శాసనసభ్యులకు, అలాగే గ్రామ ప్రజా ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ప్రారంభించిన సిసి రోడ్ల నాణ్యతను కాలనీవాసులు అడిగి తెలుసుకున్నారు. 

చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందనితెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ వెనుకబడిన ప్రాంతమైనందున జిల్లా కలెక్టర్ చొరవ చూపి రహదారి నిర్మాణానికి ఎక్కువ పనులు మంజూరు చేయించినందుకు కలెక్టర్ వారికి ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
నియోజవర్గంలో మొదటి విడతగా మంజూరైన సిసి రోడ్ నిర్మాణాన్ని సంక్రాంతి నాటికల్లా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో మూడు వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేశారని వాటికి టెండర్లు పిలవడం జరుగుతుందని తెలిపారు. 

పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేశారని అలాగే పార్లమెంటు సభ్యులు నిధుల నుండి ఒక కోటి రూపాయలు శాంక్షన్ ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టిగలిగామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఉచిత దీపం పథకం కింద మూడు సిలిండర్లను అందజేస్తుందని పేర్కొన్నారు. మూడు వేలు పింఛను వెయ్యి రూపాయలకు పెంచి నాలుగు వేలు సొమ్మును ఒకటో తారీఖునే అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. హౌసింగ్ కి సంబంధించి ప్రభుత్వం బిఎల్సి స్కీం కింద ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి 2047 స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ తీర్చిదిద్దానికి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు. 

అనంతరం శాసనసభ్యులు సోంగ రోషన్ కుమార్ పొలసిగూడెంలో రూ. 70 లక్షలు, ఎర్రగుంటపల్లిలో రూ. 30 లక్షలు, సీతానగరం రూ. 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి రామకృష్ణ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎం. వి. రమణ, పంచాయతీరాజ్ ఎస్సీ రమణమూర్తి, డ్వామా పిడి సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏస్ ఈ త్రినాధ బాబు, తాహసిల్దార్ జోసఫ్, ఎంపీడీవోలు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.