వ్యాధి నిర్థారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోండి..
కృష్ణా జిల్లా: కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ‘‘కుష్టు’’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
జిల్లా కుష్టు నివారణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుష్టు వ్యాధి పరీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్లను పోస్టర్లను, కరపత్రాలను సోమవారం స్థానిక శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వ పరంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న రోగులను ముందుగానే గుర్తించి సకాలంలో వైద్య సహాయం అందించగలిగితే వ్యాధిని త్వరితగతిన నివారించవచ్చునన్నారు.
కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జనవరి 20వ తేది నుండి ఫిబ్రవరి 2వ తేది వరకు మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కు నుండి రక్తం కారడం, కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళు, అరిచేతులలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, చేతివేళ్ళు, కాళ్ళ వేళ్ళు వంకర్లు తిరగడం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్థారణ చేయడం జరుగుతుందన్నారు.
ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు ఆరోగ్య కేంద్రాలలోని ఆరోగ్య కార్యకర్త వద్ద యండిటి మందులను అందుబాటులో ఉంచి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వ్యాధి లక్షణలు ఉన్న వారు సద్వినియోగం చేసుకుని కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు సహకరించాలన్నారు.
జిల్లా కుష్టు నివారణ అధికారిణి డా. ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. ఆశ వర్కర్లు, మేల్ వాలంటీర్లు, ప్రతి ఇంటిని సందర్శించి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఎఎన్‌ఎంలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. లక్షణాలు ఉన్న వారి డేటాను ప్రత్యేక యాప్ ద్వారా వైద్య అధికారులకు అందజేస్తారన్నారు. వైద్యాధికారులు లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి కుష్టు వ్యాధి నిర్థారణ అయితే వ్యాధి తీవ్రతను బట్టి 6 నెల నుండి 12 నెలల వరకు ప్రతి నెల మందులను వైద్య సేవలను వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 54 లెప్రసీ కేసులను గుర్తించడం జరిగిందని వారికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రా ద్వారా వైద్య సేవలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.
పోస్టర్లు, కరపత్రాల విడుదల కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మి నరసింహం, జిల్లా కుష్టు ఎయిడ్స్ టి.బి నివారణ అధికారిణి డా. జె. ఉషారాణి, డియంఅండ్‌హెచ్‌వో యం. సుహాసిని, డిఆర్‌డిఏ పిటి కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.