రంజీ ప్రిపరేషన్‌లో విరాట్ కోహ్లీ బిజీ.. భారత మాజీ ఆల్‌రౌండర్‌తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్


SPORTS NEWS: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గత కొన్ని నెలలుగా ఆశించిన మేర రాణించలేకపోయాడు. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లలో అతడు విఫలమయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోవడమే లక్ష్యంగా అతడు సాధన ప్రారంభించాడు. ఈనెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ.. ఢిల్లీ తరఫున ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు.


గతంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్ బంగర్ నేతృత్వంలో అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆదివారం బంగర్ సమక్షంలో కోహ్లీ.. ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. వాస్తవానికి ఫ్రంట్ ఫుట్ ఆడటంలో కోహ్లీకి ఎలాంటి ఇబ్బందిలేదు. సమస్యల్లా బ్యాక్ ఫుట్ ఆటతోనే వస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతడు వైఫల్యానికి అదే కారణం.

రంజీ మ్యాచ్ సహా.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. గతంలో కూడా సంజయ్ బంగర్.. చాలా సార్లు కోహ్లీకి సాయం చేశాడు. బంగర్.. 2014 నుంచి 2019 మధ్యలో భారత బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో నమోదు చేసిన 80 సెంచరీల్లో ఎక్కువ శతకాలు సాధించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా బంగర్ కోచ్‌గా వ్యవహరించాడు. దీంతో అతడి సాయం తీసుకోవాలని కోహ్లీ భావించాడు.

ఆదివారం నాటి ప్రత్యేక సెషన్‌లో.. సిమెంట్ పిచ్‌పై విరాట్ ప్రాక్టీస్ చేశాడు. అతడికి బంగర్ త్రోలు వేసినట్లు వీడియోలో కనిపించింది. సుమారు 16 గజాల నుంచి బంగర్.. కోహ్లీకి త్రోలు వేశాడు. ఇక కఠోర సాధన చేస్తున్న కోహ్లీ.. రంజీ, ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్లో 15.50 సగటుతో 93 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లో కలిపి.. 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. రైల్వేస్‌తో రంజీ మ్యాచ్ తర్వాత కోహ్లీ.. భారత జట్టుతో కలవనున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.