ఏలూరు ఊరిలో పులి పిల్లల కలకలం.. చూసేందుకు జనం క్యూ, చివర్లో ట్విస్ట్ ఏంటంటే!


ELURU: ఏలూరు జిల్లాలో పులి పిల్లలు కనిపించాయంటూ ప్రచారం కలకలం రేపింది. ఏం జరిగిందంటూ జనాలు ఆరా తీశారు.. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు రంగంలోకి దిగారు. వెంటనే పిల్లలు దొరికిన చోటికి వెళ్లి పరిశీలించారు.. వాళ్లు చెప్పిన మాటతో అందరూ అవాక్కయ్యారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం కృష్టవరం గ్రామ సమీపంలో నాలుగు పులి పిల్లలు కనిపించాయని స్థానికులు చెప్పడంతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు. అక్కడ రోడ్డుపక్కన తోటలో నాలుగు పిల్లల్ని ఓ బుట్టలో జాగ్రత్తగా ఉంచారు. అయితే అవి పులి పిల్లలని కొందరు, కాదు పిల్లి పిల్లలని అక్కడ చర్చ జరిగింది.

ఆగిరిపల్లి మండలంలో కొద్ది నెలల క్రితం ఒక మగ పులి పొలం వద్ద పెట్టిన ఉచ్చులో పడి చనిపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఇటీవల తెల్లవారుజామున బస్టాండ్‌కు వెళ్తోన్న ఆర్టీసీ కండక్టర్‌కి మెట్టపల్లి దగ్గర ఓ పులి పిల్ల కనిపించిందని ప్రచారం జరగడంతో భయంతో వణికిపోయారు. అలాగే కృష్ణవరంలో కొండగట్ల ప్రాంతంలో ఇటీవల మేకలపై పులి దాడి చేసిందనే ప్రచారం కూడా నడిచింది. ఇలా వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో పులి పిల్లలు ఉన్నాయని చెప్డపంతో.. ఆగిరిపల్లి మండల ప్రజలు భయంతో వణికిపోయారు.

ఈ పిల్లలు దొరికాయని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఎల్ బాల తన సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకుని ఆ పిల్లలను పరిశీలించారు. వాటిని ఫోటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు. చివరికి అవి పులి పిల్లలు కాదని.. అడవి పిల్లి పిల్లలని తేల్చారు. అడవి పిల్లులు పిల్లలను వదిలేసి ఆహారం వెళ్తుండటం సాధారణమేనని.. పులి అయితే తన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి వెళ్లదని ఆమె తెలిపారు. మొత్తం మీద పులి పిల్లలు అంటూ ప్రచారం జరగడంతో అందరూ భయపడ్డారు.. అటవీశాఖ అధికారులు పిల్లి పిల్లలని చెప్పడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now