దళిత యువకుడి వివాహ ఊరేగింపును ముస్లింలు అడ్డుకున్నారని.. వరుడిని గుర్రంపై నుంచి కిందకి లాగారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు బాధితులకు అండగా నిలిచారని పేర్కొంటున్నారు. వీడియోలో పెద్ద సంఖ్యలో జనంతో పాటు పోలీసులు కూడా కనిపిస్తున్నారు. పెళ్లి బృందంలోని సభ్యులను ముస్లింలు కొట్టారని చెబుతున్నారు. దళితుడనే కారణంతోనే ముస్లింలు పెళ్లి ఊరేగింపును అడ్డుకొని, వరుడిని గుర్రం పైనుంచి కిందికి లాగారా? మతం కోణంలో షేర్ చేస్తున్న ఈ ఘటన వెనుక కారణం వేరే ఉందని మా (సజగ్ బృందం) పరిశీలనలో తేలింది. వివరాలు..
క్లెయిమ్ ఏంటి?
దళితుల పెళ్లి ఊరేగింపును అడ్డుకున్న ముస్లింలు - ఎక్స్ (ట్విట్టర్)లో @DevikaRani81 అనే పేరుతో ఉన్న ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ ‘సహరాన్‌పూర్‌లో దళితుల పెళ్లి ఊరేగింపును అడ్డుకున్న ముస్లింలు. బాధితులకు అండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు. పోలీసుల రక్షణలో ఊరేగింపు. జై భీమ్, జై మీమ్ అంటారు. దళితులపై దాడులకు తెగబడ్తారు’ అని పేర్కొన్నారు.
@SonOfBharat7 అనే మరో ఎక్స్ ఖాతా నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ.. ‘దళిత వరుడికి ముస్లిం సమాజం ఇచ్చిన బహుమతి. దళితుల వివాహ ఊరేగింపును గ్రామంలోకి అనుమతించలేదు. పవిత్ర రంజాన్‌ను అంటరానిదిగా చేస్తుందని వాళ్లు అలా చేశారు’ అని రాశారు. ‘జై భీమ్, జై మీమ్ ఐక్యత వర్ధిల్లాలి. దళిత సోదరులారా.. ఇలాగే ఐక్యతను ప్రదర్శిస్తూ ఉండండి. విషయం ముస్లింల గురించి అయితే, మౌనంగా ఉండండి. లేకుంటే మీ ఐక్యత, సోదరభావం దెబ్బతింటుంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
@jpsin1 అనే మరో హ్యాండిల్ నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ.. ‘సహరాన్‌పూర్‌లో ఒక దళితుడి వివాహ ఊరేగింపు జరుగుతోంది. వరుడు గుర్రంపై స్వారీ చేస్తుండగా, ముస్లింల గుంపు వివాహ ఊరేగింపును ఆపి, వరుడిని గుర్రంపై నుంచి కిందకు లాగింది. వరుడి బంధువులను కొట్టారు. ఆ తర్వాత 5 పోలీస్ స్టేషన్ల నుంచి భారీ పోలీసు బలగాలు వచ్చి ఆ వరుడిని, ఊరేగింపు సభ్యులను ముస్లింల నుంచి రక్షించి పంపించాయి. యూపీలో యోగిరాజ్ ఉన్నందున, నిందితులందరినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద అరెస్టు చేశారు’ అని రాశారు.
@MeghUpdates అనే పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి కూడా ఇదే వీడియోను షేర్ చేశారు. ఎక్స్‌లో ఇంకా పలు అకౌంట్ల నుంచి ఈ వీడియోను షేర్ చేస్తూ ఇవే రకమైన వ్యాఖ్యలను పోస్టు చేశారు.
ఈ వీడియో వెనుక వాస్తవం ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను కనుగొనేందుకు మేం (సజగ్ బృందం).. తగిన కీవర్డ్స్‌తో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. అప్పుడు అమర్ ఉజాల మార్చి 6న ప్రచురించిన ఒక వార్తా కథనం లింక్ లభించింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ వివాదానికి కారణం వేరే ఉంది.
సహరాన్‌పూర్‌లోని చిల్కానా పోలీస్ స్టేషన్ పరిధిలోని తోదర్‌పూర్ గ్రామంలో ముస్లింలు రంజాన్ ఉపవాసం విరమించే సమయంలో పెళ్లి ఊరేగింపు డీజే శబ్దాలతో అటు వైపు వచ్చింది. అప్పుడు డీజేను ఆపాలని పేర్కొంటూ ముస్లింలు ఆ పెళ్లి ఊరేగింపును అడ్డుకున్నారు. ఈ వార్త గురించి తెలియగానే హిందూ సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగి, ఉద్రిక్తతలకు దారితీసింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వివాహ ఊరేగింపును డీజే లేకుండా కొనసాగించాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించారు.
సహరాన్పూర్ ASP వివేక్ తివారీ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ‘ఒక వీధి మీదుగా వివాహ ఊరేగింపు వెళ్తుండగా చిన్న వివాదం తలెత్తింది. రంజాన్ ఉపవాసం విరమించే సమయం కావడంతో ఒక వర్గం అభ్యంతరం తెలిపింది. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకొని.. ఇరు వర్గాలకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించారు. పెళ్లి ఊరేగింపును DJ లేకుండా వారి గమ్యస్థానానికి తరలించాం’ అని అన్నారు.
ముగింపు:
ఉత్తర ప్రదేశ్‌లో ముస్లింలు ఒక పెళ్లి ఊరేగింపులో దళిత యువకుడిని గుర్రం మీద నుంచి కిందకి దించి, ఊరేగింపును అడ్డుకున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియో తప్పుదోవ పట్టించేవిధంగా ఉంది. వివాహ బృందంపై దాడి జరిగిందనే వార్తలో వాస్తవంలేదు. రంజాన్ ఉపవాసం విరమించే సమయంలో డీజేతో పెళ్లి ఊరేగింపు రావడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరించారు.
दलित दूल्हे को मुस्लिम समाज का तोहफा...
— Deepak Sharma (@SonOfBharat7) March 8, 2025
दलित की बारात को गांव में नहीं निकने दिया
बोले इससे हमारा पवित्र रमजान अछूत होगा..
जय भीम... जय मीम एकता जिंदाबाद ✊
शाबाश दलित भाइयों...ऐसे ही एकता दिखाओ
मामला मुसलमान का है.. तो चुप रहना
वरना आपकी एकता भाईचारा खराब होगा✍️
सहारनपुर UP pic.twitter.com/otW5Vbep04