ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలి..


జిల్లాలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలి..
సోలార్ ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి..


ఏలూరు:  ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం విజయవాడ ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, త్రాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎమ్ఈల సర్వే మరియు నియోజకవర్గాలలో ఎంఎస్ఎమ్ఈ పార్కు ల ఏర్పాటు, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. 

స్థానిక కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్న జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు నగరంలో త్రాగునీటి సమస్యలేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వీసీ అనంతరం అధికారులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 19న మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. 

ఈ మాసం లో "ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్"(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. జిల్లా అంతట పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని, తడి పొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పీఎం కుసుమ్ కార్యక్రమం ద్వారా జిల్లాలో సోలార్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా త్రాగు నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను వనరుల ద్వారా పూర్తిగా నింపుకోవాలని సూచించారు. నీటి రవాణా అవసరమైన ప్రాంతాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. 

పశువులకు నీటి తొట్టెల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో చేపట్టిన ఎంఎస్ఎమ్ఈల సర్వేను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉద్యం డేటా మరియు ఎంఎస్ఎమ్ఈ డేటా తేడాలు ఉండరాదన్నారు.  ఉద్యం పోర్టల్లో ఉన్న అర్హత కలిగిన యూనిట్లు అన్ని ఎం ఎస్ ఎం ఈ సర్వే పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. 

ఈ సమావేశంలో ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఇరిగేషన్ ఎస్ ఈ నాగార్జునరావు, ఆర్ డబ్ల్యూఎస్ఇ సత్యనారాయణ, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, డిఐసి జిఎం సుబ్రహమణ్యేశ్వరరావు, కాలుష్య నియంత్రణామండలి ఈఈ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.