సజ్జల రామకృష్ణారెడ్డి.. రెడీ అవాల్సిందే ?


ANDRAPRADESH, AMARAVATHI: వైసీపీలో ఈ రోజుకీ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నపుడు సకల శాఖల మంత్రిగా పేరు గడించారు. అన్ని విషయాలూ ఆయనే మాట్లాడేవారు. ఇక ఆయన ప్రభుత్వ సలహాదారుగా నియమితులైనా అన్నింటికీ తానే కీలకం అని ప్రతీ సందర్భంలోనూ కనిపించేవారు. ఆయన వైఖరి విపక్షాలకు ఆగ్రహం తెప్పించగా సొంత పార్టీ వారికి కూడా కన్నెర్ర అయ్యారని అంటారు. ఇక వైసీపీ విపక్షంలోకి వచ్చినా సజ్జల స్థానం మాత్రం చెక్కు చెదరకుండానే ఉంది. సజ్జలని ఈ రోజుకీ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ గా నియమించారు. 


మరో వైపు చూస్తే కనుక సజ్జల రామక్రిష్ణా రెడ్డిని కూటమి గతంలోనే టార్గెట్ చేసింది. ఇపుడు అధికారంలో ఉంది. దాంతో సజ్జల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకుని వస్తారని అంటున్నారు. సజ్జల మీద చర్యలు ఏవీ అని కూటమి నేతల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సజ్జల వల్లనే చాలా మంది టీడీపీ సీనియర్లు పోలీసు కేసులలో ఇరుక్కున్నారని వారు అనుమానిస్తున్నారు. 

ఆయన తెర చాటు హోం మంత్రిగా నాడు వ్యవహరించారు అని కూడా ఆరోపించినట్లుగా ప్రచారంలో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం విషయంలో అరెస్ట్ చేసిన ఘటనలో సజ్జల పాత్ర ఉందని ఆయనే దగ్గరుండి డైరెక్షన్ అంతా చేశారు అని కూడా టీడీపీ బడా నాయకులే అనుమానిస్తున్న నేపధ్యం ఉంది. 

ఇంతలా సజ్జల మీద కోపం పెంచుకున్న కూటమి పది నెలల కాలంలో ఆయనను ఎలా వదిలేస్తోంది అన్న దానికి జవాబు అయితే లేదు అయితే సజ్జలను వదిలేసింది లేదని అంటున్నారు. ఆయన విషయంలో ఒక పధకం ప్రకారం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని అంటున్నారు. అన్ని ఆధారాలతో గట్టిగా కేసు పెడితే కనుక ఏ విధంగానూ తప్పించుకునేందుకు వీలు ఉండదని భావిస్తున్నారు. మరో వైపు చూస్తే సజ్జల సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఏ విధంగా అయినా ఏ విషయంలో అయినా కేసులు పెట్టవచ్చు అన్న చర్చ ఉంది. అయితే కేసు పెడితే గట్టి బిగింపుతో ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే వీలు లేకుండా ఉండాలని భావిస్తున్నారుట. 

అంతే కాదు కేసు పకడబంధీగా నమోదు చేస్తే కనుక కోర్టులకు వెళ్ళినా కనీసంగా కూడా ఊరట దక్కదని కూడా భావిస్తున్నారుట. దాంతో సజ్జల మీద ఇపుడు ఒక కేసు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఆయన కుటుంబం అటవీ భూములను ఆక్రమించుకున్నారు అన్న ఆరోపణల మీద కేసు ఫైల్ చేస్తే కనుక దిట్టంగా ఈ కేసు నిలబడుతుదని లెక్కలేస్తున్నారుట. నిజానికి చూస్తే అటవీ చట్టాలు చాలా స్ట్రాంగ్ అని చెబుతారు. 

వాటిలో కనుక ఇరుక్కుంటే ఒక పట్టాన రిలీఫ్ ఉండదని అంటారు. దాంతో సజ్జల విషయంలో ఇదే కరెక్ట్ రూట్ అని అంటున్నారు ఇక సజ్జల ఫ్యామిలీకి అటవీ చట్టాలకు సంబంధం ఏమిటి అంటే అక్కడే బిగ్ స్టోరీ ఉందని అంటున్నారు. చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వు అటవీ ప్రాంతంలోని ఒక అడవిని నరికేశారు. అంతే కాదు అందులో భూములను కూడా తమకు నచ్చిన విధంగా ఆక్రమించుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలున్నాయి. 

ఇక ఆ భూములు ఒకటీ అరా కాదు ఏకంగా అరవై ఎకరాల ఫారెస్ట్ భూమి ఆక్రమించారంటూ అటవీ, రెవెన్యూ శాఖల నివేదిక కూడా ఇవ్వడంతో అది కూటమి ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నివేదికను ఆధారం చేసుకుని మరీ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందన్న పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక అరవై ఎకరాల అటవీ భూములు దురాక్రమణలకు గురి అయ్యాయని అటవీశాఖ స్పష్టం చేయడంతో ఆ దిశగా లోతైన దర్యాప్తు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. 

ఈ దర్యాప్తు కూడా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సం యుక్తంగా సర్వే చేసి ఆధారం ఉన్న ప్రతీ ఒక్కరి మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. అయితే సజ్జల తాను ఏ కేసు విషయంలో అరెస్ట్ కాకుందా ముందస్తు బెయిల్ ని చాన్నాళ్ళ క్రితమే తెచ్చుకున్నారు. అయితే అటవీ చట్టం వెరీ పవర్ ఫుల్ కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ రద్దు అవుతుందా ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా సజ్జల కనుక అరెస్ట్ అయితే అది వైసీపీకి పెద్ద కుదుపుగా ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపుగా ఉంటుందని అంటున్నారు.