రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల బలం ఉన్నప్పటికీ, వారిని ముందుండి నడిపించాల్సిన నేతలు మాత్రం ముఖం చాటేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు, జోగి రమేశ్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం వంటి కొద్ది మంది నేతలు మాత్రమే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారని చెబుతున్నారు. అధినేత జగన్ తోపాటు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి ముఖ్య నేతలు ఎక్కడా కనిపించకపోవడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.
సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఏడాదిగా హామీలు అమలు చేయడం లేదని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ అధినేత జగన్ నిరసనలను పిలుపునిచ్చారు. దీంతో కొద్ది రోజులుగా ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చాలా హడావిడి కనిపించింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ, అనేక వీడియో సందేశాలతో వైసీపీ సోషల్ మీడియా దుమ్ము రేపింది. దీంతో జూన్ 4న కార్యక్రమం జరిగే రోజు ఎలా ఉంటుందో? అనే ఆసక్తి కనిపించింది.
అయితే అధినేత జగన్ తో సహా పెద్ద నేతలు ఎవరూ కార్యక్రమానికి రాకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహం చెందారని అంటున్నారు. కార్యక్రమం నిర్వహించిన చోట కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయలేకపోయారని, అదో మొక్కుబడిగా ముగించారని ప్రచారం జరుగుతోంది. కార్యక్రమం జరిగిన కొన్ని చోట్ల యువత నుంచి మంచి స్పందన కనిపించినా, పార్టీ సరైన రీతిలో వినియోగించుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నేతల టార్గెట్ గా ప్రభుత్వం అరెస్టుల పర్వానికి తెరతీయడం కూడా ఈ ధర్నాలపై కనిపించిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం హిట్ లిస్టులో ఉన్నారని చెబుతున్న నేతలు చాలా మంది వెన్నుపోటు దినం కార్యక్రమంలో కనిపించకపోవడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యక్రమం సక్సెస్ చేసే విషయమై దిశానిర్దేశం చేయాల్సిన అధిష్టానం.. ముందుగా హడావుడి చేసి కార్యక్రమం నిర్వహించిన రోజు చేతులెత్తేసిందని అంటున్నారు. మరోవైపు మెజార్టీ నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు అందుబాటులో లేక కార్యక్రమం జరగలేదని అంటున్నారు. ఎన్నికల ముందు చేసిన మార్పుల వల్ల దాదాపు సగం నియోజకవర్గాల్లో స్థానికేతరులే సమన్వయకర్తలుగా ఉన్నారు. వీరు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సోషల్ మీడియాపై పెట్టిన ఇంట్రెస్ట్ క్షేత్రస్థాయి కార్యక్రమాల నిర్వహణపైనా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.