సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సీగాచి కెమికల్స్ అనే రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలుకోల్పోగా.. 38 మందికి పైగా గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఈరోజు ( జూన్ 30, 2025 ) ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా.. ఊహించని ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కాగా పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని ఉత్పత్తి విభాగ భవనం పూర్తిగా కూలిపోగా.. మరో భవనానికి కూడా బీటలు పడ్డాయని అంటున్నారు. కార్మికులు పలువురు 100 మీటర్ల దూరం ఎగిరిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం అవ్వగా.. మిగతా వారు తీవ్ర గాయాల కారణంగా మృతి చెందినట్టు వాపోతున్నారు. శిథిలాల కింద ఇంకా 15 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గాయపడిన 38 మందిలో 20 మందిని చందానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మిగతా 18 మందిని ఇస్నాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడు జరిగినప్పుడు పరిశ్రమలో 60 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. బారీ క్రేన్‌లు, హైడ్రా మిషన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం ఆరుగురినే భద్రంగా బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతే కాకుండా పేలుడుతో పాటు విషవాయువులు విడుదల కావడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసనలు వ్యాపించాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతూ తమ ఇళ్లలోకి చేరుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సంఘటనా స్థలానికి రావొద్దని హెచ్చరించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi