హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే ప్రస్తుతం విజయవాడ మీదుగా వెళ్లక తప్పని పరిస్దితి. విజయవాడ వరకూ వచ్చాక చెన్నై-కోల్ కతా హైవే మీదుగా ఏలూరు దాటాక మధ్యలో నల్లజర్ల, దేవరపల్లి హైవే ఉన్నా అది తిరిగి రాజమండ్రి వద్దే ముగిసిపోతోంది. దీంతో ప్రయాణికులు తిరిగి చెన్నై-కోల్ కతా హైవే పైకి వచ్చి విశాఖ వెళ్లక తప్పని పరిస్దితి. దీంతో హైదరాబాద్-విశాఖ ప్రయాణాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం-దేవరపల్లి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే తెరపైకి వచ్చింది. ఇప్పటికే దీని నిర్మాణం కొనసాగుతోంది.
మరో ఆరు నెలల్లో ఖమ్మం-దేవరపల్లి మధ్య కీలకమైన గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం మీదుగా దేవరపల్లి, విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఈ హైవే నిర్మాణం వల్ల హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణికులకు రెండు గంటల ప్రయాణ సమయం కూడా తగ్గబోతోంది. అంతే కాదు టోల్ గేట్ల విషయంలోనూ కీలక మార్పులు రాబోతున్నాయి.
162 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేపై 100 కిలోమీర్ల వేగంతో కార్లు, బస్సులు, లారీలు మాత్రమే వెళ్లేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. దీనిపైకి బైక్ లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా అనుమతించరు. అలాగే ఈ హైవేపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో కేవలం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇస్తున్నారు. ఇక్కడే టోల్ వసూలు చేస్తారు. మధ్యలో రోడ్డుపై టోల్ గేట్ ఉండదు. దీని వల్ల వాహనాలు ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు చెల్లించే వెసులుబాటు కూడా వస్తుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi