ANDHRAPRADESH:విజయనగరంలో రాజుల ఆధిపత్యం దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. పీవీజీ రాజు నుంచి మొదలుపెడితే అశోక్ గజపతిరాజు దాకా డెబ్బై అయిదేళ్ళుగా జిల్లాను రాజకీయంగా శాసించారు.
విజయనగరంలో రాజుల ఆధిపత్యం దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. పీవీజీ రాజు నుంచి మొదలుపెడితే అశోక్ గజపతిరాజు దాకా డెబ్బై అయిదేళ్ళుగా జిల్లాను రాజకీయంగా శాసించారు. ఇపుడు కురు వృద్ధ రాజకీయ నేతగా ఉన్న అశోక్ గజపతి రాజు రాజ్యాంగబద్ధమైన పదవిలోకి మారిపోతున్నారు.
ఆయన ఇప్పటిదాకా ఏ మాత్రం రాజకీయ ప్రకటనలు చేసినా ఇక ముందు అది కూడా ఉండదు. నిజం చెప్పాలీ అంటే గత ఏడాది కాలంగా అశోక్ గజపతిరాజు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అపుడపుడు మాత్రమే ఆయన ముఖ్యమైన టీడీపీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. ఇపుడు ఆయనను గవర్నర్ పదవి వరించింది.
దాంతో ఆయన రాజ్ భవన్ లోకి కొత్త పదవిలోకి మారబోతున్నారు. గవర్నర్ పదవి అంటే రాజ్యాంగపరమైనది. ప్రోటోకాల్ తో కూడుకున్నది గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటారు. దాంతో అశోక్ ఆ పదవిలో పూర్తిగా కుదురుకోబోతున్నారు.
దశాబ్దాల తరబడి విజయనగరం జిల్లాను అశోక్ శాసించారు. ఎన్టీఆర్ హయాం అయినా చంద్రబాబు జమానా అయినా విజయనగరం జిల్లాలో రాజకీయం పూర్తిగా అశోక్ కనుసన్నలలోనే నడుస్తూ వచ్చింది. ఆయన మాటే శిరోధార్యంగా ఉండేది. ఆయన అనుకున వారే పదవులు అందుకునేవారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన మాటే చెల్లింది అని ప్రచారంలో ఉంది.
ఆయన చెప్పిన వారే మంత్రి పదవిని అందుకున్నారని అంటారు. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయం ఇపుడు ఎవరి చేతులల్లోకి వెళ్ళబోతోంది అన్నది చర్చగా ఉంది విజయనగరం జిల్లా బీసీలు బలంగా ఉన్న ప్రాంతం, వెలమలు తూర్పు కాపులు ఈ జిల్లాలో కీలకంగా ఉంటారు. అయినా సరే అశోక్ చక్రం తిరిగింది. పూసపాటి వంశీకులకు ఉన్న గౌరవ మర్యాదలతో సామాజిక సమీకరణలు తేడాపాడాలు లేకుండా అంతా పెద్దాయనగా అశోక్ చెప్పినట్లే నడచుకున్నారు.
అయితే అశోక్ సైతం ఎవరికీ అన్యాయం చేయలేదు. పైగా సమన్యాయం పాటించారు. అటువంటి వారు రాజకీయాలకు దూరంగా ఉండడడం అంటే జిల్లాకూ టీడీపీకి కూడా నష్టమే అని చెప్పాలి. అశోక్ అంటే ప్రజలకు ఎంతో గురి. అందుకే ఆయనతోనే అంతా అడుగులు వేశారు. ఇపుడు పెద్దాయన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అన్న చర్చ పార్టీలో సాగుతోంది.